పంచాయితీల్లో పడకేసిన పారిశుద్ద్యం

అంటురోగాలకు కారణమవుతున్న పరిసరాలు

Dlo Gervier : canal de drainage provenan de Seau d’eau entre autres ; bouché près de la RN1 par des déchets domestiques

ఆదిలాబాద్‌,మార్చి4(జ‌నంసాక్షి): పంచాయతీల్లో జనాభాకు సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో పల్లెలో పారిశుద్ధ్యం పడకేసింది. మురుగుకాల్వల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవారు లేనందున దుర్వాసన వెదజల్లుతుండటంతో ప్లలె ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారుల్లోనే మురుగు నీరు ప్రవహిస్తుండటం.. దోమల బెడద తీవ్రం కావడంతో రోగాల బారిన పడుతున్నారు. గ్రామ పంచాయతీల్లో సరిపడా పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడం సమస్యలకు కారణమవుతోంది. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. ప్రజల్లో స్వచ్చతపై చైతన్యం లేకపోవడమే కారణమని అధికారులు వాపోతున్నారు. ఎంతగా ప్రచారం చేసినా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం లేదన్నారు. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సాధారణ నిధుల నుంచి 30 శాతం వరకు పారిశుద్ద్యానికి ఖర్చు చేయాలనే నిబంధన గతంలో ఉండేది. తర్వాత దాన్ని 50 శాతానికి పెంచారు. అంటే పంచాయతీకి వస్తున్న ఆదాయంలో సగం పారిశుద్ద్యానికే వెచ్చిస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగకపోగా, పారిశుద్యం కూడా మెరుగు పడడం లేదు. ప్రభుత్వం చెత్త సేకరణకు అందించిన రిక్షాలు చాలా పంచాయతీల్లో వృథాగా ఉంటున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల కొరత.. ఉన్నవారికి రిక్షాలు తొక్కిన అనుభవం లేకపోవడంతో వాటిని వినియోగంలోకి తేవడంలేదు. ప్రస్తుతం గ్రామ పంచాయ తీల్లో సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో ప్రైవేటు కూలీలను ఏర్పాటు చేయించుకొని పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. తద్వారా పంచాయతీలపై ఆర్థిక భారం పడుతోంది. గ్రామాల్లో సర్పంచ్‌లు పటిష్టంగా పనిచేయడంతో పాటు ప్రణాళికలు సిద్దం చేసేలా అధికారులు కార్యాచరణసిద్దం చేయాలి. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఎవరికి వారు తమ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటే తప్ప ఇది సాధ్యం కాదని అధికారులు అంటున్నారు.