పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం

జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఆదిలాబాద్‌,జనవరి5(జ‌నంసాక్షి): జిల్లాలో పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం చేశారు.  మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీలకు ఈ నెల 7 నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభంకానుంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 465 పంచాయల్లో ఎన్నికలు జరుగనుండగా.. 110 క్లస్టర్లను ఏర్పాటు చేసారు.  ఆయా క్లస్టర్‌ పరిధిలోని పంచాయతీలు, వార్డు సభ్యు ల నామినేషన్లను క్లస్టర్‌ వారీగా అందజేయాల్సి ఉంటుంది. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.చాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు  కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అధికారులను సమాయత్తం చేశారు. శాసనసభ ఎన్నికలను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించామని, అదే తరహాలో ఈ ఎన్నికలను కూడా పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.   ఎంపీడీవో, తహసీల్దార్‌, పోలీసు అధికారులు సమన్వయంతో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. అర్హత గల ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, ఫారం-6 ద్వారా ఓటరు నమోదు చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్క వార్డులోని అర్హత గల వారికి ఓటు హక్కు ఉందో, లేదో ఇంటింటికీ వెళ్లి వారి వివరాలు నమోదు చేయాలన్నారు. డిస్టిబ్యూష్రన్‌ రిసెప్షన్‌ సెంటర్లను ఏ ర్పాటు చేయాలని, పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పోలింగ్‌ సిబ్బందికి బ్యాలెట్‌ బాక్స్‌లను తెరవడం, పేపర్‌ సీల్‌ వేయడం వంటి వాటిపై మరోసారి శిక్షణ తరగతులు నిర్వహించాలని, ప్రతి ఒక్కరితో ప్రాక్టికల్‌గా చేయించాలన్నారు. ఎన్నికల సందర్భంగా వినియోగించే మెటీరియల్‌ అందుబాటులో ఉంచాలని అన్నారు.