పక్కాగా ఎన్నికల నిర్వహణ

కోడ్‌ అమలు కోసం కఠిన నిర్ణయాలు
కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌
కరీంనగర్‌,మార్చి11(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికలకు  సర్వం సన్నద్దగా ఉన్నట్లు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ప్రకటించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి తెలిపారు. పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని  ఆదేశించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి పోలింగ్‌ కేంద్రంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నందున ఏర్పాట్లకు సిద్ధంగా ఉండాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల లోకేషన్లను ముందుగానే గుర్తించాలని సూచించారు.  సీ-విజిల్‌ యాప్‌ ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిధిలోని సరిహద్దుల వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయాలని, అక్రమంగా తరలించే డబ్బు, మద్యం లాంటివి సీజ్‌ చేయాలని ఆదేశించారు. సీజ్‌ చేసిన వాటికి రశీదులు రాయాలని
సూచించారు. ఎన్నికల్లో పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన విడుదల కాగానే వ్యక్తిగత భద్రత కోసం ఆయుధాలు కలిగి ఉన్న వారు సంబంధిత పోలీసు స్టేషన్‌లలో డిపాజిట్‌ చేసేలా చూడాలన్నారు. నేర చరిత్ర కలిగి ఉన్న వారిని బైండోవర్‌ చేయాలన్నారు. జిల్లాలో జరిగే లోకసభ ఎన్నిలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్పష్టం చేశారు. లోకసభ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఆయన సీపీ కమలాసన్‌ రెడ్డితో కలిసి ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు.లోకసభ ఎన్నికలు మరింత పకడ్భందీగా నిర్వహిస్తా మన్నారు. ఈ నెల 25 సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. 26న నామినేషన్ల పరిశీలన, 28న ఉప సంహరణ ఉంటుందని అన్నారు. ఏప్రిల్‌ 11న జరిగే మొదటి విడతలోనే కరీంనగర్‌ లోకసభకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. లెక్కింపు మే 23 ఉంటుందన్నారు. అమలులోకి వచ్చిన కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలని అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు ఆయన సూచించారు. వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం కోసం ముద్రించే కరపత్రాలు, పోస్టర్లపై ప్రింటర్‌, పబ్లిషర్‌ పేర్లు తప్పకుండా ఉండాలన్నారు. పోటీ చేసే అభ్యర్థుల ఆమోదంతోనే ప్రచార సామాగ్రిని ప్రింట్‌ చేయించాలని సూచించారు. లేని పక్షంలో వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయనీ, వీటి పరిధిలో 15,44,460 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఈ నెల 15 వరకు కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తామని, తుది జాబితాను ఈ నెల 25న ప్రకటిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో పేర్లు లేని వారు వెంటనే తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.