పడకేసిన పారిశుద్ధ్యం- పందులు స్వైరవిహారం

పబలుతున్న రోగాలు
పట్టించుకోని పాలకులు, అధికారులు
పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.  దీంతో దోమలు వద్ధి చెందిన ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.  ప్రస్తుతం కురుస్తున్న ముసురు వర్షాలకు డ్రెయినేజీల్లో వరదనీటితోపాటు ఇళ్లల్లోని మురుగునీరు ముందుకు వెళ్లలేక దుర్వాసన వెదజల్లుతోంది. దీనికితోడు పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలు వద్ధి చెంది ప్రజలు సీజనల్ వ్యాధులతో  ఆస్పత్రులపాలవుతున్నారు.   పట్టణంలో 20 వార్డుల్లో 26వేల మంది జనాభా నివసిస్తున్నారు. పలు కాలనీల్లో డ్రెయినేజీ సౌకర్యం లేక రోడ్ల పైనే మురుగునీరు ప్రవహిస్తోంది. మరికొన్ని కాలనీల్లో ఇళ్లమధ్యనే దుర్గంధపునీరు చెరువులా నిల్వ ఉంటున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండు,పాత పోలీస్‌స్టేషన్,మటన్ మార్కెట్,శంకరసముద్రం కాలువలు మరింత దుర్గంధంగా మారాయి. దీంతో దోమలు వద్ధి చెంది రాత్రి పూట నిద్రపోనివ్వడంలేదని పట్టణవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందాయి. పారిశుద్ధ్యలోపం, పందులు, దోమలబెడదతో ప్రజలు చలిజ్వరం, వాంతులు, బేదులు, మలేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు.ప్రతి రోజూ వందకు పైగా జనం అస్వస్థతకు గురవుతున్నారు. రోగులతో ప్రభుత్వ,ప్రై  వేటు ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. డ్రెయినేజీలో మురుగునీరు నిల్వ ఉన్నా, రోడ్లు దుర్గంధం వెదజల్లుతున్నా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మురుగుకాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరినా స్పందించడంలేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.  సర్పంచ్ చెన్నకేశవరెడ్డి పట్టణంలో నెలకొన్న పరిస్థితులపై దష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.