పత్తికి ప్రత్యమ్నాయాలు చూపాలి

మారుతున్న పరిస్తితులు, అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో పత్తి ఇప్పుడు గిట్టుబాటు కాని పంటగా మారబోతోంది. రైతులు కూడా ఒకిని చూసి మరొకరు అన్నట్లుగా ఇంతకాలం అదేపనిగా పత్తిని వేస్తూ వచ్చారు. తొలుత లాభాలు వచ్చినా ఇప్పడు మాత్రం కొనుగోళ్లు లేక నష్టాలను ఎదుర్కొన్నారు. దీనికితోడు నకిలీ విత్తనాలు కూడా రైతుల కొంపలు ముంచాయి. అందుకే  పత్తిసాగు తగ్గించమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రత్యామ్నాయ పంటలపై పెద్దగా ప్రచారం జరగడం లేదు.  ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం పత్తికి వ్యతిరేకంగా  ఇప్పటికే ఓ రకమైన ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా పత్తికి ధరలు రావడం లేదు. దీనికితోడు పప్పుదినుసులకు, అపరాలకు గిరాకీ ఉండడంతో అటువైపు మొగ్గు చూపాలని వ్వయసాయ వేత్తలుకూడా సూచిస్తున్నారు. పత్తి విత్తుకోవడానికి ఇంకా సమయం ఉంది కనుక ఇప్పటినుంచే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయాధికారలుఉ సూచిస్తున్నారు. అసలే ధరలు లేక డీలాపడుతున్న వేళ కొందరు వ్యాపారులు అమాయక  రైతులను లక్ష్యంగా చేసుకోని నకిలీ పత్తి విత్తనాలు అంటగట్టేందుకు సిద్ధం అవుతున్నారు. నిబంధనల మేరకు గ్రామాల్లో విత్తనాలు అమ్మవద్దు. కాని కొంత మంది అనుమతులు లేకుండా పలుగ్రామాల్లో విత్తనాలు అమ్ముతున్నారు. వ్యవసాయశాఖ అధికారుల ఏలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు మోసపోవల్సివస్తోంది. ఈ విత్తనాలకు ప్రైవేట్‌ వ్యాపారులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని కంపెనీలు తమ విత్తన రకాలు ఎక్కువగా అమ్మాలని గరిష్ఠ చిల్లరధర కంటే తగ్గించి ఇస్తుండగా, మరి కొంతమంది వ్యాపారలు అరువుగా ఇచ్చేస్తున్నాయి. రైతుల అవసరాలు, వారి ఆశలను సొమ్ము చేసుకోవాలని కొంత మంది మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేశారు. నిబంధనల మేరకు ఏ కంపెనీ అయినా డీలర్ల ద్వారా విత్తనాలు అమ్మాల్సి ఉంటుంది. అయితే నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించిన వ్యాపారులు స్థానికంగా గ్రామాల్లో ఉండే ఒకరిద్దరిని ఎంపిక చేసుకోని వారితో తెలిసిన రైతులకు అమ్మేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. బిటి విత్తనాలు ప్రవేవించాక చాలాప్రాంతాల్లో అవిమొలకెత్తినా పత్తి కాయదశకు చేరుకోక అనేకమంది నష్టపోయిన ఘటనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం విత్తనాలు అమ్మేవారు ముందుగా సంబంధిత వ్యవసాయశాఖ నుంచి లైసెన్స్‌ పొంది ఉండాలి. నిర్దేశించిన విత్తన రకాలనే అమ్మాలి. అమ్మే విత్తనాలకు ప్రభుత్వ అనుమతి ఉండాలి. కొనుగోలు చేసే రైతులకు సంబంధిత వ్యాపారులు విత్తన రకం, లాట్‌నంబర్‌, ధర తదితర వివరాలను నమోదు చేసి పక్కా రసీదు ఇవ్వాలి. ఇలా ఉంటేనే అనుకోని కారణాల వల్ల విత్తనరకం వల్ల పంట నష్టపోతే పరిహారం వచ్చే అవకాశం ఉంటుంది. విత్తనాలకు అనుమతి ఉన్నా, గ్రామాల్లో నేరుగా అమ్ముకోవడానికి అవకాశం లేదు.ఏ రోజుకారోజు నిల్వల సమాచారం షాపులో ఉంచాల్సి ఉంటుంది. అయితే పత్తి వేసుకోవద్దని ప్రభుత్వం పెద్దెత్తున ప్రచారం చేయకపోవడంతో రైతులు విత్తన అమ్మకం దారుల మాయలో పడుతున్నారు. రైతు సంక్షోభంపై ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు మెల్లగా మాట్లాడుతున్నాయి. అటు కేంద్రం ఇటు రాష్టాల్రు ఈ సమస్యలపై చర్యలకు పూనుకుంటున్న తీరు అభినందనీయం. దేశంలో తీవ్ర కరవు సంక్షోభం నేపథ్యంలో ప్రత్యేక వ్యవసాయ విధానం గురించి అంతా చర్చ చేస్తున్నారు.  దేశంలోని రాష్టాల్రు, జిల్లాలు, మండలాల వారీగా నీటి లభ్యత, సాగుకు అనుకూల మయ్యే పంటలను గుర్తించి రైతులను చైతన్యం చేయాలని ప్రధాని మోడీ వ్వయసాయశౄఖను ఆదేశించారు.  ఏ పంటలు ఎక్కడ పండించాలో రైతులకు తెలియ చేసి అందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందచే/-తే పేచీ ఉండదు.  రైతులు ఖచ్చింతంగా ఫలానా పంటలు ఆత్రమే వేయాలన్న

నిబంధన  లేకపోవడం వల్ల రైతులు ఎవరికి వారు తమకు తోచిన విధంగా వ్వయసాయం చేస్తూ, అదృష్టం ఉంటే లాభం లేకుంటే నష్టం పొందుతున్నారు. ఇదంతా ఓ జూదంలా సాగుతోంది. ఎక్కడ ఏ పంటలు వేయాలో తెలియక ఇష్టం వచ్చినట్లుగా మార్కెట్లో విత్తన మాఫియా రాజ్యం ఏలుతోంది.ఇలా తెలంగాణలో పత్తి వేసిన రైతులు భారీగా నష్టపోయారు. అలాగే నీళ్లు లేకున్నా వరి వేసిన రైతులు నష్టపోతున్నారు. కాలువల కింద కూడా నీటికి గ్యారెంటీ లేక గోదావరి జిల్లాల్లో తీవ్రంగా నష్టపోయారు. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయా, ఉల్లి, పసుపు వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రణాళికలు రూపొందిస్తున్నది. అదేవిధంగా రాష్ట్రంలో అపరాల విస్తీర్ణం పెంచడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మన నేలలు, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతతో అధిక దిగుబడులు సాధించే అవకాశాలున్నాయని వ్యవసాయశాస్త్రవేత్తలు చెప్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా క్రమంగా పప్పుధాన్యాల దిగుబడి తగ్గుతున్న నేపథ్యంలో అపరాల సాగును ప్రోత్సహించేందుకు 2016ను అపరాల సంవత్సరంగా యూఎన్‌ఓ ప్రకటించింది. అనేక ప్రత్యామ్నాయ పంటలపై రైతు దృష్టి మర్చేలా యుద్ధప్రాతిపదికన వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇకపోతే వ్యవసాయం యావత్తూ కరెంట్‌, నీటి లభ్యత ఆధారంగా సాగుతోంది. నీరుంటే వరి మాత్రమే వేయాలన్న ధోరణి రైతుల్లో ఉంది.  చెరువుల్లో నీరు లేక కబ్జాలకు గురికావడంతో చిన్ననీటి పారుదల రంగం చిన్నబోయింది. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. దీంతో వ్యవసాయం భారంగా మారింది. ఉపాధి కోసం వ్యవసాయం చేస్తున అన్నదాతలు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. ఈ విధానం మారితేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందనడంలో సందేహం లేదు.