పత్తి ధరల్లో తేడాతో రైతుల ఆందోళన

ఆదిలాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  పత్తిధరలతో మరోమారు రైతులు ఆందోళన  చెందుతున్నారు. రాష్ట్రంలోనే వరంగల్‌లో రూ.5300, జమ్మికుంటలో రూ.5350 మద్దతు ధర పలకగా.. జిల్లాలోని బోథ్‌లో రూ.5350 ధర పలికింది. జిల్లాలోని మార్కెట్లలో ధర వ్యత్యాసం ఉంది. మద్దతుధర తగ్గడంతో రైతులు మార్కెట్‌లో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యాపారులను ధర చెల్లించాలంటూ నిలదీశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర తగ్గడంతో పత్తికి మద్దతు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు రైతులకు తెలిపారు. దీంతో కొద్దిసేపు పత్తి కొనుగోళ్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో సీసీఐ నిర్ణయించిన మద్దతు ధరలు చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు. పత్తి ని తక్కువ ధరకు అమ్ముకోవద్దని జేసీ సంధ్యా రాణి రైతులకు సూచించారు. పత్తి కొనుగోళ్లు ప్రారంభమైన మొదటి రోజు ప్రైవేట్‌ వ్యాపారులు రూ.5800 చెల్లిం చి కొనుగోలు చేశారు. ఆ తర్వాత క్రమంగా ధర తగ్గుతూ వస్తోంది. జాతీయ మార్కెట్‌లో బేల్‌, కాటన్‌ సీడ్‌ ధరలు పడిపోవడంతో మార్కెట్‌లలో పత్తికి మద్దతు ధర తగ్గుతూ వస్తోంది. వారం రోజుల క్రితం క్వింటా పత్తికి రూ.5450 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. మూడు రోజులుగా రోజుకు క్వింటాకు రూ.20 నుంచి రూ.30 వరకు ధర తగ్గింది.  కేంద్ర ప్ర భుత్వం పత్తి క్వింటాకు
మద్దతు ధర రూ.5450 ప్రకటించిందన్నారు. ఈ ధరకు పైన చెల్లించి ప్రై వేట్‌ వ్యాపారులు పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. కానీ మద్దతు ధరకు తక్కువ చెల్లించి కొనుగోలు చేయడం సరికాదని వ్యాపారులకు సూచించారు. రైతులు తమ పత్తిని సీసీఐకే విక్రయించుకోవాలన్నారు. తక్కువ ధరకు అమ్ముకొని నష్టాల పాలుకావద్దని పేర్కొన్నారు. ఇబ్బందులున్నా మార్కెటింగ్‌ శాఖ అధికారులకు రైతులు తెలియజేయాలని పేర్కొన్నారు.