పత్తి రైతులను తక్షణం ఆదుకోవాలి: సిపిఐ

ఆదిలాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): పత్తిపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల వద్ద ఉన్న పంటనంతా కొనుగోలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ డిమాండ్‌ చేశారు. తేమ తదితర కారణాలతో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. తూకంలో మోసాలతో పాటు, దళారుల బెడద నిర్మూలించాలన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి  డిమాండ్‌ చేశారు.  రైతాంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.  రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. రుణమాఫీ చేయకుండా రైతాంగాన్ని మోసగించారని ఆరోపించారు. నకిలీ విత్తనాల విక్రయ సంస్థల నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం కంటితుడుపు చర్యేనని ధ్వజమెత్తారు. విపక్షాల సూచనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. సమైక్య పోరాటాలతో పాలకుల మెడలు వంచి రైతులను కాపాడతామని అన్నారు. నకిలీవిత్తనాలతో నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 1లక్ష పరిహారం చెల్లించాలని, వర్షాభావం, అతివృష్టి వల్ల నష్టపోయిన పత్తిని అంచనావేసి ఎకరానికి రూ. 50వేలు ఇవ్వాలని, పత్తిక్వింటాకు రూ. 6వేలు చెల్లించాలని, రుణమాఫీ ఒకే విడత చేయాలని, నకిలీ విత్తనాలు నిరోధించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేసారు.