పదేళ్ల తరవాత న్యూజిలాండ్‌పై వన్డే సీరిస్‌ కైవసం

రిచర్డ్స్‌ రికార్డను బద్దలు కొట్టిన కోహ్లీ

మౌంట్‌ మాంగనూయ్‌,జనవరి28(జ‌నంసాక్షి):  ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఘన విజయం సాధించిన కోహ్లీ సేన మరో అరుదైన రికార్డును సాధించింది. సరిగ్గా పదేళ్ల తర్వాత న్యూజిలాండ్‌ గడ్డపై సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2009లో ధోనీ సారథ్యంలోని టీమిండియా కివీస్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. పదేళ్ల తర్వాత కోహ్లీ సేన మళ్లీ ఆ ఘనత సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ మరో ఏడు ఓవర్లు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఇకపోతే  టీమిండియా పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుని, ఇంకో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఆసీస్‌లో మొదలైన విజయ పరంపరను న్యూజిలాండ్‌లోనూ కొనసాగిస్తున్న కోహ్లీ సేన ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మూడు వన్డేల్లోనూ ఘన విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. పదేళ్ల తర్వాత న్యూజిలాండ్‌ గడ్డపై టీమిండియా సిరీస్‌ను సొంతం చేసుకుంది. కాగా, ఈ విజయంతో టీమిండియా సారథి కోహ్లీ మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. విండీస్‌ దిగ్గజం సర్‌ వివ్‌ రిచర్డ్స్‌, దక్షిణాఫ్రికా దివంగత కెప్టెన్‌ హాన్సీ క్రోనే రికార్డును కోహ్లీ బద్దలుగొట్టాడు. ఇప్పటి వరకు 63 వన్డేలకు సారథ్యం వహించిన కోహ్లీ 47 వన్డేల్లో భారత్‌కు విజయాలు అందించాడు. ఈ క్రమంలో 46 వన్డే విజయాలతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న వివియన్‌ రిచర్డ్స్‌, హాన్సీ క్రోనేలను కిందికి నెట్టేసి ఆ స్థానాన్ని కోహ్లీ ఆక్రమించాడు. 41 విజయాలతో ఆసీస్‌ క్రికెటర్‌ మిచెల్‌ క్లార్క్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. 50 విజయాలతో దిగ్గజ ఆటగాళ్లు క్లైవ్‌ లాయిడ్‌, రికీ పాంటింగ్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.