పర్యావరణ పరిరక్షణపై కానరాని చిత్తశుద్ది

దేశంలో పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నా పాలకులు పెద్దగా స్పందించడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యావరణానికి కాలుష్యం పెను సవాల్‌గా మారింది. ఎవరికి వారు రాత్రికి రాత్రి స్వర్గం సృష్టిస్తామన్న రీతిలో ప్రకటనలు చేసిన వారే. దేశంలోని వివిధ రాష్టాల్ల్రో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ కూడా స్వచ్చతకు తీసుకునే చర్యలు ప్రకటించలేదు. పర్యావరణం కోసం పనిచేస్తామని చెప్పలేదు. అలాగే మన ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఆహార రంగంపై దృష్టి పెడతామన లేదు. సేంద్రియ వ్యవసాయంపై ఎక్కడా ప్రస్తావన లేదు. పాలన చేపట్టాలనుకుంటున్న వారికి ఈ విషయాల్లో పెద్దగా అవగాహన లేకనా లేకపోతే ప్రజలకు వీటిగురించి చెబితే ఓటేయరనా, లేకపోతే సమాజం పట్ల బాధ్యత లేకపోవడమా అన్నది అర్థం కావడం లేదు. పర్యావరణ పరిరక్షణ అన్నది ఏ పార్టీకి కూడా ముఖ్యమైన విషయంగా కనిపించలేదు. స్వచ్ఛ భారత్‌ గురించి పదేపదే చెబుతున్న బిజెపి కూడా దీనిని పెద్దగా ప్రస్తావించడం లేదు. స్వచ్ఛత అన్నది వ్యక్తిగతమైన శ్రద్దకు సంబంధించినది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇలాంటి శ్రద్ద తక్కువనే చెప్పలి. అందువల్లనే మనదేశంలో అనారోగ్యకర వాతావారణం ఎక్కువే. అలాగే వ్యాధుల సంక్రమణ, అంటువ్యాధుల వ్యాప్తి కూడా ఎక్కువే. అదేపనిగా ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల, ప్లాస్టిక్‌ వినియోగాల వల్ల క్యాన్సర్‌ విపరీతంగా వ్యాప్తిస్తోంది. సామాన్య రోగాలతో పోటీ పడి ఇప్పుడు క్యాన్సర్‌ మన సమాజాన్ని నిర్వీర్యం చేస్తోంది. దీనిపై బాధ్యతగలిగిన పార్టీలు ప్రస్తావన లేకుండా మాట్లాడుతున్నాయి. ఇలాంటి అంశాలను ప్రజలు నిలదీయ గలగాలి. స్వచ్ఛ భారత్‌ ప్రకటించిన తరవాత దేశంలో కొంత మార్పు గోచరిస్తోందని భావించినా ప్రచారాలాతో పని కావడం లేదని తేలిపోయింది. రాజకీయ పార్టీలు విధిగా దీనిని ఓ అంశంగా తమ మేనిఫెస్టోలో పెడితే బాగుంటుందని పర్యావరణవేత్తలు అన్నారు. చట్టబద్దంగా పర్యావరణ పరిరక్షణ చర్యలకు ప్రభుత్వాలు పూనుకోవాల్సి ఉందన్నారు. అలాగే రానున్న రోజులకు మంచి వాతావరణం కల్పించాల్సి ఉందన్నారు. ఈ దశలో రాజకీయ పార్టీలు తమ విధాన పత్రాల్లో పర్యావరణ పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం, ప్లాస్టిక్‌ నిషేధం వంటివి ఎలా అమలు చేస్తారో చెప్పగలగాలి. పరిశుభ్రత లోపించిన కారణంగానే వ్యక్తిగతంగానే గాక పరిసరాల శుభ్రతా లోపించి అతిసారం, కలరా వంటి వ్యాధులు పెచ్చరిల్లు తున్నాయి. మురికివాడల వద్ద ఖాళీ ప్రదేశాలు, పొలం ప్రాంతాలు, వూళ్ల శివారు స్థలాలు, రైలు పట్టాల పరిసరాల్లో కాలకృత్యాలు హానికరంగా పరిణమిస్తున్నాయి. అటువంటి అనారోగ్యకర వాతావరణంలో సగటు మనుషులకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఎంత అవసరమో వేరే చెప్పనవసరం లేదు. ఈ అవసరాన్ని గుర్తించారు కాబట్టే, కేరళలో దశాబ్దాల క్రితమే ‘ఇంటింటికీ సెప్టిక్‌ లెట్రిన్‌’ అనేది ఒక విధంగా ఉద్యమ స్థాయిలో సాగింది. అదే స్ఫూర్తి ఇతర రాష్టాల్రకీ వ్యాపించాల్సి ఉంది. పారిశుద్యం, వీధులు శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయడం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించడం తదితర అంశాలు సామాజిక బాధ్యత కావాలి. ఈ రకమైన చైతన్యం కోసం ఉద్యమించాల్సి ఉంది. పంచాయతీల్లో జనాభాకు సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో పల్లెలో పారిశుద్ధ్యం పడకేసింది. మురుగుకాల్వల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవారు లేనందున దుర్వాసన వెదజల్లుతుండటంతో ప్లలె ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారుల్లోనే మురుగు నీరు ప్రవహిస్తుండటం.. దోమల బెడద తీవ్రం కావడంతో రోగాల బారిన పడుతున్నారు. అనేక అంటురోగాలు ప్రబలుతున్నాయి. మలేరియా, డెంగ్యూ విజృంభిస్తోంది. గ్రామ పంచాయతీల్లో సరిపడా పారిశుద్ధ్య సిబ్బంది లేకపోవడం సమస్యలకు కారణమవుతోంది. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. ఆర్థికంగా పంచాయితీలు బలోపేతంగా లేకపోవడంతో పాటు,సర్పంచ్‌లు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల గ్రామాల్లో పారిశుద్య కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. దీనికితోడు పరిశుభ్రతకు సంబంధించిన పనులు తమకు సంబందించినవి కావన్న ధోరణిలో ప్రజలు ఉన్నారు. పరిశుభ్రతా సాధనలో భాగంగా, శౌచాలయ వ్యవస్థపై ఎనలేని కేంద్రం శ్రద్ధ చూపుతోంది. ఈ దశలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఓ హావిూ ఉండాలి. రాజకీయ పార్టీలకు బాధ్యత ఉండాలి. ప్రజల, ప్రభుత్వ ఉమ్మడి భాగస్వామ్యమే స్వచ్ఛతను, శుభ్రతను సాకారం చేస్తుంది.అందుకు అనుగుణంగా అవసరమైతే కఠినచర్యలు తీసుకోవాలి. స్వచ్ఛతకు సంబంధించి ప్రజల్లో చైతన్యంతో పాటు కఠిన నిబంధ నలు అమల్లోకి రావాలి. దీనిని తప్పనిసరి చేయడం ద్వారానే లక్ష్యం సాధించగలం. ప్రజల్లో నిర్లిప్తత తొలగాలి. పరిశుభ్రత పాటించకపోతే వ్యక్తిగతంగా తమకు, తద్వారా సమాజానికి చేటు జరగుతుందన్న విషయం ప్రచారం చేయాలి. ప్రజలను నిరంతర చైతన్యం చేయడం ద్వారానే సంపూర్ణ స్వచ్ఛత సాధించ గలమని గుర్తించాలి. ఇందుకు ఈ ఎన్నికల్లో పార్టీలు చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. ఎన్నికల్లో ఉచిత తాయిలాలు ఇవ్వడం మాటెలా ఉన్నా బాధ్యతాయుత ప్రకటనలు కూడా ఉండాలి. పాలకులకు చిత్తశుద్ది రావాలి. అప్పుడే మనం ఆరోగ్యకర సమాజంలో ఉండగలం. పౌరులు కూడా ఇందుకు ఎవరు అనుగుణంగా ఉంటున్నారో గమనించి ఓటేయాల్సి ఉంది. రాజకీయ పార్టీలు దీనికి కట్టుబడి ఉంటామని ప్రకటించి దేశ భవిష్యత్‌ ప్రమాదంలో పడకుండా కాపాడాలి. అందకు నఅ/-నిరాజకయీ పార్టీలు కంకణబద్దమై ముందుకు సాగాలి.