పల్లెనిద్రతో మాజీ స్పీకర్‌

ర్యాలీలతో మంత్రి చందూలాల్‌
ప్రచారంలో జోరు పెంచిన నేతలు
వరంగల్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా ఓ వైపు పలు నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు ఆందోళనలకు దిగుతున్నా టిక్కెట్లు దక్కిన వారు మాత్రం ఇవేవిూ పట్టించుకోకుండా ప్రచారంలో దూసుకుని పోతున్నారు. ఎక్కడిక్కడ తమ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రామాల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు హారతులు పడుతున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. పల్లెనిద్రతతో ఆయన ప్రజలను తట్టిలేపుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. రోజుకో గ్రామంలో పల్లెనిద్ర చేస్తూ వారితో మమేకం అవుతున్నారు. మళ్ళీ తనను గెలిపిస్తే అన్ని విధాలా అభివృద్ధిలో నడిపిస్తానని మధుసూదనాచారి హావిూ ఇచ్చారు. భారీ మెజార్టీతో మధుసూదనాచారిని గెలిపించుకుంటామని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్ది రెడ్యానాయక్‌ ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రామాల్లో రెడ్యా నాయక్‌ ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు భారీగా హాజరై.. కోలాటాలతో, మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం ఖాయమని అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు ప్రజా మద్దతు వెల్లువెత్తుతోంది. విపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్‌ఎస్‌ లో చేరారు. టీఆర్‌ఎస్‌ కే ఓటేస్తామని.. సీఎం కేసీఆర్‌ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలు తెలిపారు. జనగామలో ముత్తిరెడ్డి, స్టేషన్‌ ఘనాపూర్‌లో రాజయ్యలు కూడా ప్రచారంలో దూకుడు పెంచారు. గ్రామాలను చుట్టి వస్తున్నారు. రోజుకో గ్రామాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్నారు.  ములుగు నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి చందూలాల్‌ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత ములుగు మండలంలోని సలు గ్రామాల్లో  భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ములుగులో రోడ్‌షో జరిపి నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చేసిన కృషిని చందూలాల్‌ ప్రజలకు వివరించారు. ఆ తర్వాత మంగపేట, ఏటూరునాగారం మండలాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ములుగులోని తన క్యాంపు కార్యాలయంలో ఎన్నికల ప్రచారం నిర్వహణపై నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ నేతలతో భేటి అయ్యారు. మంగళవారం గోవిందరావుపేట మండలంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు.