పవన్‌ కళ్యాణ్‌ అస్పష్ట రాజకీయాలు

కాంగ్రెస్‌, వైకాపాలను దెబ్బతీయడమే లక్ష్యంగా కార్యాచరణ
హైదరాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): ప్రజారాజ్యం పార్టీతో టిడిపిని దెబ్బకొట్టడం ద్వారా కాంగ్రెస్‌కు అధికరాం దక్కేలా ఆనాడు చిరంజీవి పరోక్షంగా పనిచేశారు. ఆ తరవాత ఆయన ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయ్యింది. తరవాత చిరంజీవి రాజ్యసభ సభ్యుడయ్యారు. కేంద్రమంత్రి కూడా అయ్యారు. ఇక రాజ్యసభ సభ్యత్వం ముగిస్తే  రాజకీయంగా కనుమరుగు కావచ్చు. అందుకే ఆయన తను నమ్ముకున్న చిత్ర పరిశ్రమకు అంకితం అవుతున్నారు. తాజాగా తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఇక సినిమాలు చేయబోనని ప్రకటించారు. పూర్తిస్థాయి రాజకీయాల్లో దిగుతున్నానని, అందుకే కొండగట్టు అంజన్న ఆశిస్సులు తీసుకుంటున్నానని తెలిపారు. కొంచెం అటుఇటుగా ఇద్దరి లక్ష్యం ఒకేలా ఉంది. గత ఎన్నికల్లో ప్రచారంలోకి దిగిన పవన్‌ కళ్యాణ్‌ కేవలం వైకాపాను దెబ్బకొట్టడం ద్వారా చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు తెలంగాణాలో కెసిఆర్‌ పాలన బాగుందంటున్న పవన్‌ ఏ లక్ష్యం కోసం ఇక్కడ రాజకీయ పార్టీగా మనగులగుతారో చెప్పడం లేదు. కెసిఆర్‌ పానల బాగుంటే మరో పార్టీ అవసరం లేదు. అయితే అంతోఇంటో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని దెబ్బకొట్టడానికి పవన్‌ ప్రచారం పనికి రావచ్చు. అప్పుడు పవన్‌ పరోక్షంగా కెసిఆర్‌కు మద్దతుగానే ఉంటారని స్పష్టం అవుతోంది. రాజకీయంగా ఓ లక్ష్యం లేకుండా సాగుతున్నారన్న విమర్ళకన్నా పరోక్షంగా తనకంటూ ఓ లక్ష్యం ఉందని నిరూపించుకునే రాజకీయాలు నడపడమే పవన్‌ కళ్యాణ్‌ లక్ష్యం కావచ్చు. కాంగ్రెస్‌ నేతల పంచెలూడదీసి కొట్టాలన్నదే లక్ష్యం కావచ్చు. రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేక పోయానని చెబుతూ వచ్చిన పవన్‌ అందుకు కారణమైన కాంగ్రెస్‌పై కసితో
రాజకీయాలు చేస్తున్నారని భావించవచ్చు. ప్రశ్నల పేరుతో పుట్టిన జనసేన అసలు ప్రశ్నలే వద్దు అంటూ తెలుగు రాష్టాల్ర ముఖ్యమంత్రులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న తీరు చూస్తుంటే కేవలం కాంగ్రెస్‌ను రాజకీయంగా టార్గెట్‌ చేస్తున్నట్లుగా ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం చేసిన మంచి పనులను విస్మరించి..తప్పులను మాత్రమే ఎత్తిచూపుతుంది.కానీ..చంద్రబాబు, కెసీఆర్‌ పాలన భేషుగ్గా ఉన్నాయని పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం చేస్తున్నారు. దీంతో అక్కడ వైకాపాను, ఇక్కడ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడమే పవన్‌ లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ తీరు చూస్తుంటే మాత్రం రాజకీయ నాయకులే విస్మయానికి గురయ్యే పరిస్థితి ఉంది. గతంలో పవన్‌ చేసిన విమర్శలకు నేటి ప్రకటనలకు పొంతన లేకుండా పోయింది. గత ఎన్నికల ముందు వరంగల్‌ సభలో కెసీఆర్‌ను నీ తాటతీస్తా అని,కవిత కూడా లెక్కుల చెప్పాలని అడిగారు. గతంలో పవన్‌ పై కెసీఆర్‌, కవితలు తీవ్ర వ్యాఖ్యలే చేశారు. నా భార్యలు, వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడితే ఏ నేత ఎవరెవరితో తిరుగుతున్నారో నా అభిమానులు క్షణాల్లో సమాచారం ఇస్తారని అంటూ హెచ్చరికలు చేశారు.  ప్రజారాజ్యంలో ఉండగా వైఎస్‌ ను బట్టలూడదీసేలా కొడతారని కూడా అన్నారు. మొత్తంగా పవన్‌ తను అనుకున్న లక్ష్యం మేరకు  అవకాశవాద రాజకీయాలు చేస్తున్నట్లుగా ఉంది. ఏపీలో తిరుగుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడి పనిచేస్తున్నారని..ఆయన చేస్తున్న పనులకు తాను అడ్డం పడనని ప్రకటిస్తారు. ఇప్పుడు తెలంగాణ పర్యటనలోనూ కెసిఆర్‌ పాలన భేషుగ్గా ఉందన్నారు. ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకోనని..ప్రభుత్వాలను గౌరవించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. చూస్తుంటే  వైకాపా,కాంగ్రెస్‌లను దెబ్బకొట్టేందుకు  పవన్‌ కళ్యాణ్‌ ఏపీలోనూ, తెలంగాణలోనూ అధికార పార్టీలతోనే ముందుకు సాగేట్లు కన్పిస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  రానున్న  ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో, తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో కలసి సాగడం ఖాయంగా ఉంది. ఇకపోతే తెలంగాణలో పవన్‌ కళ్యాణ్‌  జనసేన బలం పరిమితం. ఎన్నికల బరిలో నిలిచి ప్రచారం చేస్తే  ప్రభావం చూపించటం అంతంత మాత్రంగానే ఉంటుంది. కెసిఆర్‌ను తిడుతూ ప్రచారం చేస్తే తెలంగాణ దాటటడం కూడా కష్టమే.  ఈ విషయం తెలుసుకున్న పవన్‌  కళ్యాణ్‌ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో సఖ్యతకే మొగ్గుచూపుతున్నట్లుగా ఉంది.  గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కెసీఆర్‌, ఆయన తనయుడు, మంత్రి కెటీఆర్‌ కూడా పవన్‌ విషయంలో సానుకూల ధోరణితోనే ఉన్నారు.   టీఆర్‌ఎస్‌తో జనసేన దగ్గరవుతున్న విషయాన్ని  గుర్తించే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ ఇప్పటికే ఎదురుదాడి ప్రారంభించింది. ప్రభుత్వాల తప్పులను ప్రశ్నించటం మర్చి ప్రశంసించటంలో మునిగి తేలుతున్నారంటూ మండిపడుతోంది.  రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలన్న తెలంగాణ సర్కారు నిర్ణయంపై పవన్‌ కళ్యాణ్‌ స్వయంగా ప్రగతిభవన్‌ కు వెళ్లి మరీ సీఎం కెసీఆర్‌ పై పొగడ్తల వర్షం కురిపించి మరీ వచ్చారు. మొత్తంగా పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ టూర్‌ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎటువంటి ప్రభావం చూపదనే అనుకోవాలి.