పశువులకు తాగునీటి సమస్య

కడప,మే17(జ‌నం సాక్షి): మండుతున్న ఎండలకు తోడు కరువు విలయతాండవం చేయడంతో మంచినీటి సమస్యతో ఆపటు మూగజీవాలకు నీరందక బక్కచిక్కి పోతున్నాయి. నీటి కోసం పశువులను సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రైతులు గ్రాసం కోసం నానాయాతన పడుతున్నారు.  పశుగ్రాసం కూడా అందడం లేదని పశువుల కాపర్లు వాపోతున్నారు. వర్షాలు సకాలంలో పడకపోవడంతో చాలా ఇబ్బందిగా మారుతోందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది గొర్రెల కాపరులు తమ మందలను తోలుకొని సంవత్సరానికి ఒక సారి నల్లమల్ల అడవులకు మేత కోసం వెళ్తారు. అక్కడ వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయి జీవాలకు తాగేందుకు నీళ్లులేక మృత్యువాత పడుతున్నాయని పశువుల కాపర్లు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం అక్కడక్కడ నిర్మించిన చెక్‌ డ్యామ్‌లూ, ఇంకుడు గుంతలూ నిరుపయోగంగా మారాయని వారు వాపోతున్నారు. గొర్రెలకు సకాలంలో నీరు, మేత లభిస్తే కాపర్లు మంచి ధర వస్తుంది. లేకపోతే వాటిపై పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అల్లాడిపోతారు. ఏదిఏమైనా నీటి సమస్య వీపరితంగా ఉండడం వల్ల పశుపోషణ భారమౌతోం దన్నారు. ప్రతి మూగ జీవికీ ఇన్సూరెన్స్‌ చేస్తున్నామని 
రైతులు పేర్కొన్నారు. ప్రభుత్వం వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పశువులకూ, గోర్రెలకూ దాణా సకాలంలో అందించి ఆదుకోవాలని పశువుల కాపర్లు కోరుతున్నారు.