పసుపు కుంకుమతో ప్రజల్లో గొడవలు

అధికారుల తీరుపై మహిళల ఆగ్రహం
నెల్లూరు,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి):  పసుపు కుంకుమ గ్రామాల్లో కలహాలకు కారణమయ్యింది. ఇందుకూరు పేట నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకం గొడవలు సృష్టిస్తోంది. పొదుపు మహిళలకు చిరుసాయం చేయాలని ఒక్కొక్క పొదుపు మహిళకు పది వేల రూపాయలు ఇవ్వాలని పథకం పెట్టింది. అందులో భాగంగా.. ఇటీవల పదివేల రూపాయల చెక్కులు విడి విడిగా వారి వారి ఖాతాల్లో ఇవ్వాలని ఒకే సారి జమ చేసింది. దీనికి సంబంధించి వెలుగు అధికారులు ఒక్కొక్క మహిళ నుండి వెయ్యి రూపాయలు కమిషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇందుకూరు పేట మండలం గంగవరం గ్రామంలో గ్రూపుల మధ్య గొడవలు జరిగాయి. సుమారు అయిదుగురు మహిళలకు గాయాలయ్యాయి. అందులో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. పసుపు కుంకుమ కింద బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసిన పది వేల రూపాయలు ఇవ్వాలంటూ.. మహిళలు అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ గొడవ రాజుకుందని మహిళలు తెలుపుతున్నారు. గ్రామంలోని గ్రూపు లీడర్‌ పై గ్రూప్‌ సభ్యులు దాడి చేశారు. రావలసిన డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో.. బ్యాంకు ఖాతాను, పాత అప్పులను సరి చేసుకొని ఇస్తామని విఒ చెప్పారు. కేవలం వెలుగు అధికారుల నిర్లక్ష్యం వల్లనే గ్రూపు సభ్యులకు నగదు మంజూరు చేయడంలో జాప్యం జరిగిందని మహిళలు వాపోతున్నారు. దీంతో గ్రూప్‌ సభ్యులలో ఓ సభ్యురాలు రాజమ్మ కుమారుడు అనిల్‌ కర్రతో గ్రూప్‌ లీడర్‌పై దాడి చేశాడు. గ్రూప్‌ లీడర్‌ పద్మజ తీవ్రంగా గాయపడింది. మరో ఇద్దరు మహిళలు కూడా గాయపడ్డారు. వారిని దగ్గరలో ఉన్న నెల్లూరు ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. దీనికి సంబంధించి ఆస్పత్రి వర్గాలు ఇందుకూరుపేట మండలం పోలీసులకు కేసును అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.