పాండ్యాను నాతో పోల్చొద్దు!

– మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌

న్యూఢిల్లీ, జనవరి18(జ‌నంసాక్షి) : టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్‌, వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ సహనం కోల్పోయాడు. టీమిండియా రెండో టెస్ట్‌ ఓటమి, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రదర్శనపై స్పందిస్తూ.. కాస్త ఘాటైన కామెంట్సే చేశాడు. పాండ్యా ఇలాంటి చిల్లర పొరపాట్లు చేస్తున్నన్నాళ్లూ.. తనతో పోల్చేందుకు అర్హుడు కాడని కపిల్‌ స్పష్టంచేశాడు. రెండో టెస్ట్‌లో పాండ్యా బ్యాటింగ్‌ చేసిన తీరుపై కపిల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. టీమ్‌లోకి వచ్చిన అనతి కాలంలోనే తన ఆల్‌రౌండ్‌ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన పాండ్యాను.. చాలా మంది కపిల్‌దేవ్‌తో పోల్చుతున్న విషయం తెలిసిందే. గతంలో దీనిని స్వాగతించిన కపిల్‌.. ఈసారి మాత్రం అసహనం వ్యక్తంచేశాడు. సెంచూరియన్‌ టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పాండ్యా దారుణంగా ఔటైన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో బద్ధకంగా క్రీజులో బ్యాట్‌ పెట్టడం మరచిపోయి రనౌటయ్యాడు పాండ్యా. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సమయంలో బాధ్యతాయుతంగా ఆడాల్సిన హార్దిక్‌.. దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీనిపై అభిమానులే కాదు కపిల్‌ దేవ్‌ కూడా అసంతృప్తి వ్యక్తంచేశాడు. పాండ్యాకు చాలా టాలెంట్‌ ఉంది. తొలి టెస్టే అందుకు నిదర్శనం. అయితే అతడు మానసికంగా దృఢంగా కావాల్సిన అవసరం ఉంది అని కపిల్‌దేవ్‌ అన్నాడు. మరో మాజీ క్రికెటర్‌ సందీప్‌ పాటిల్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశాడు. అసలు కపిల్‌తో పాండ్యాను పోల్చడం ఏంటి అని అతడు ప్రశ్నించాడు. నేను కపిల్‌తో కలిసి చాలా క్రికెట్‌ ఆడాను. అసలు అతనితో పాండ్యాకు పోలికే లేదు. కపిల్‌ 15 ఏళ్ల పాటు అద్భుతంగా రాణించాడు. పాండ్యా కేవలం ఐదో టెస్ట్‌ ఆడుతున్నాడు. అతను ఇంకా చాలా చాలా దూరం వెళ్లాల్సి ఉంది అని సందీప్‌ పాటిల్‌ అన్నాడు.