పాక్‌తో టీమిండియా ఆడదు..

– స్పష్టం చేసిన ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : ఇటీవల పల్వామాలో భారత్‌ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్న విషయం విధితమే. ఈ ఘటనతో దేశంమొత్తం ఉగ్రవాదులు, వారికి ఆశ్రయమిచ్చే పాక్‌పై ఆగ్రహంతో ఉంది. ఈ ఎఫెక్ట్‌ క్రీడలపైనా పడింది. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే వరకు భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ధ్వైపాక్షిక సిరీస్‌ జరిగే అవకాశం లేదని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా శుక్రవారం తెలిపారు. రానున్న ప్రపంచ కప్‌లో భారత్‌-పాక్‌ మధ్య జరగాల్సిన మ్యాచుల గురించి తాను ఇప్పట్లో ఏ విషయమూ చెప్పలేనని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… భారత్‌-పాక్‌ ధైపాక్షిక మ్యాచులపై మా తీరు స్పష్టంగా ఉందన్నారు. ప్రభుత్వం ఒప్పుకునే వరకు పాక్‌తో టీమిండియా ఆడదన్నారు. అన్ని అంశాలకు అతీతంగానే క్రీడాస్ఫూర్తి ఉండాలని, కానీ, ఒకరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే ఆ ప్రభావం క్రీడలపైన కూడా పడుతుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ ఆడే అవకాశాలు ఉన్నాయా అన్న అంశంపై రాజీవ్‌ శుక్లా స్పందిస్తూ… ‘ఈ విషయంపై మేము ఇప్పట్లో ఏవిూ చెప్పలేమని, ప్రపంచ కప్‌కు చాలా సమయం ఉందన్నారు. ఏం జరుగుతుందో చూడాల్సిందేనన్నారు. ఉగ్రదాడిపై భారత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, పాక్‌ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలన్నారు. వారు ఉగ్రవాదానికి మద్దతు తెలపొద్దని, మొదటి నుంచి మనం ఇదే విషయాన్ని చెబుతున్నామని తెలిపారు. పాక్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందన్న విషయంపై మన వద్ద అనేక ఆధారాలున్నాయని తెలిపారు.