పాక్‌ అసత్య ప్రచారం

న్యూయార్క్‌ ,సెప్టెంబర్‌ 24,(జనంసాక్షి):ఐక్యరాజసమితి వేదికగా దాయాది దేశం పాకిస్థాన్‌ అసత్యాలను ప్రచారం చేసింది. ఆదివారం ఐరాసలో ప్రసంగించిన పాక్‌ ప్రతినిధి భారత్‌ గురించి ప్రపంచదేశాలకు అవాస్తవాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నించి నవ్వుల పాలైయ్యారు. ఆదివారం ఐరాస సర్వ ప్రతినిధుల సమావేశంలో పాక్‌ శాశ్వత ప్రతినిధి మలీహ లోధి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ముఖంపై బుల్లెట్ల గాయాలతో ఉన్న ఓ యువతి ఫోటోని చూపిస్తూ ఆ యువతి కశ్మీర్‌ కు చెందిన అమ్మాయి అని పేర్కొన్నారు. కానీ ఆ ఫోటోల గాజాకు చెందిన యువతిదిగా అనంతరం గుర్తించారు.మలీహా లోధి ఆ యువతి కశ్మీర్‌ లో పెల్లట్ల కారణంగా తీవ్ర గాయాలపాలైనట్లు తెలిపారు. కానీ నిజానికి ఆ యువతి పేరు రవా అబు జోమా. 2014లో గాజా నగరంపై జరిగిన వైమానిక దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. గాయాలతో దీనంగా చూస్తున్న ఆమెను జెరూసలేంకు చెందిన హైదీ లెవీన్‌ అనే ఫొటో జర్నలిస్టు ఫొటో తీశారు. అప్పట్లో ఆ ఫోటో సంచలనం అయింది. కానీ ప్రస్తుతం ఆ ఫొటోలోని జోమాను కశ్మీరీ యువతిగా చిత్రీకరించేందుకు పాక్‌ ప్రయత్నించి దొరికిపోయింది. దీంతో పాక్‌ పై సోషల్‌ విూడియాలో నెటిజన్లు విపరీతంగా జోకులు వేసుకుంటున్నారు. అబద్దం చెబితే అతికినట్లు ఉండాలని, అది కూడా పాకిస్థాన్‌ వల్ల కాలేదని సెటైర్లు వేస్తున్నారు.