పాక్‌ ఉగ్రదేశం

– ఐరాసలో భారత్‌

యునైటెడ్‌ నేషన్స్‌,సెప్టెంబర్‌ 22,(జనంసాక్షి): తమ దేశానికి భయపడి భారత్‌ కశ్మీర్‌ ప్రజలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలోపాక్‌ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు భారత్‌ దీటుగా బదులిచ్చింది. పాకిస్థాన్‌ ఇప్పుడు ఒక టెర్రరిస్థాన్‌ అని.. ఆ దేశం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారుతోందని ఐరాసలోని భారత తొలి సెక్రటరీ ఈనమ్‌ గంబీర్‌ అన్నారు.’గత కొన్నేళ్ల చరిత్రను చూసినట్లయితే పాకిస్థాన్‌ అంటే ఉగ్రవాదం అన్నట్లు కన్పిస్తోంది. పాకిస్థాన్‌ అంటే అర్థం స్వచ్ఛమైన భూమి. ఇప్పుడా స్వచ్ఛమైన భూమి కాస్తా స్వచ్ఛమైన ఉగ్రవాద భూభాగంగా మారింది. పాకిస్థాన్‌ ఇప్పుడు టెర్రరిస్థాన్‌. ఉగ్రవాదులను తయారుచేసి, వారిని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది’ అని ఈనమ్‌ అన్నారు. పాక్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారుతోందని.. అక్కడి ఉగ్రనేతలకు రాజకీయపరంగా రక్షణ కల్పిస్తున్నారని విమర్శలు చేశారు. లష్కరే తోయిబా నేత అయిన హఫీజ్‌ మహ్మద్‌ సయీద్‌ ప్రస్తుతం పాక్‌లోని ఓ చట్టబద్ధమైన రాజకీయపార్టీకి నాయకుడు అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.’ఉగ్రవాదులకు సౌకర్యాలు కల్పించడం కోసం పాక్‌ బిలియన్‌ డాలర్లు ఖర్చుపెడుతోంది. అక్కడ ఉగ్రవాదులు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతారు. అలాంటి దేశం భారత్‌లోని మానవ హక్కుల గురించి ప్రసంగాలు చేయడం విడ్డూరం. ఓ విఫలమైన దేశం నుంచి ప్రజాస్వామ్యం, మానవహక్కులపై ప్రసంగాలు వినే అవసరం ఈ ప్రపంచానికి లేదు’ అని ఈనమ్‌ అన్నారు. అంతేగాక.. కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో భూభాగమే అని, ఇది పాక్‌ అర్థం చేసుకుని మసులుకోవాలని హెచ్చరించారు.అంతకుముందు పాకిస్తాన్‌ ప్రధాని షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీ సమితిలో ప్రసంగిస్తూ.. తాలిబన్‌ వంటి ఉగ్రశక్తులు పాకిస్తాన్‌లో లేవు.. ఉగ్రమూకలకు ఆఫ్ఘనిస్తాన్‌ భూతల స్వర్గమని వ్యాఖ్యలు చేశారు. పాక్‌ చేసిన వ్యాఖ్యలను ఆఫ్ఘనిస్తాన్‌ తీవ్రంగా తప్పు పట్టింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని మాటలు కాకుండా.. చేతుల్లో చూపాలని హితవు పలికారు. మేం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం.. అందులో భాగంగా మా సైనికులు ప్రతిరోజూ దేశంలోనూ, సరిహద్దుల వెంబడి ఎన్నో త్యాగాలు చేస్తున్నారని ఆఫ్ఘన్‌ దౌత్యాధికారి చెప్పారు.ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రకార్యకలాపలకు సంబంధించిన ఆధారాలు, రుజువులు ఉంచే చూపాలని ఆయన అన్నారు. ఉగ్రవాద స్థావరాలు పాక్‌లోనే ఉన్నాయని.. తాము పెంచి పోషించ ఉగ్రమూకలతోనే ఆ దేశం నేడు తీవ్ర అభద్రతా భావంలోకి వెళ్లిందని చెప్పారు. తమ దేశంలోని ఉగ్రస్థావరాలను ఇప్పటికే పూర్తిగా ఏరివేశామని ఆయన అంతర్జాతీయ ప్రపంచానికి ప్రకటించారు. ఇరుదేశాల మధ్యనున్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ఆఫ్ఘన్‌ ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు.