పాడిపథకంతో రైతులకు ప్రోత్సాహం

పశువుల కొనుగోళ్లపై సబ్సిడీకి ప్రభుత్వం నిర్ణయం

వచ్చే నెలలోనే పథకం ప్రారంభం

హైదరాబాద్‌,జూలై20(జ‌నం సాక్షి): మరో బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. ఇప్టపికే మత్స్యకారులకు చేపలను, వలలను పంపిణీ చేయగా, గొల్లకుర్మలకు గొర్రెలు పంపిణీ చేసింది. తాజాగా పాడి రైతులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై బర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. వచ్చేఆగస్టు నుంచి బర్రెల పంపిణీ మొదలు పెట్టనున్నట్లు సర్కారు ప్రకటించింది. పాడిరైతులను ఆదుకుని వారిని స్వయం సమృద్ది చేయడంలో భాగంగా పాడి ఆవులను, బర్రెలను సబ్సిడీపై అందచేసేందుకు రంగం సిద్దం చేసింది. ఈ పథకం ప్రకటనతో జిల్లాల్లో పాడి రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాడిద్వారా విజయ తదితర డైరీలకు పాలుపోస్టున్న రైతులంతా సబ్సిడీ బర్రెలు తీసుకోవడానికి అర్హులు కానున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 75శాతం, బీసీ, ఓసీలకు 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నది. ఇప్పటికే విజయడైరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4చొప్పున సర్కారు ప్రోత్సాహం అందిస్తున్నది. సబ్సిడీపై పాడిపశువులు కావాల్సిన రైతులంతా ఈ-లాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు పక్రియ ఇంకా కొనసాగుతున్నది. పాడిరైతులతో సొసైటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సొసైటీల్లో సభ్యులై ఉండి, ఈ-లాప్‌లో పేరు నమోదు చేసుకున్న వారినే బర్రెల పంపిణీకి అర్హులుగా ప్రభుత్వం గుర్తిస్తున్నది. అయితే కొత్తగా పాడిరైతులకు సభ్యత్వం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు.ఇప్పటికే ప్రభుత్వ విజయడైరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున అదనంగా అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం లీటర్‌కు రూ.4 చొప్పున ప్రోత్సాహం అందిస్తుండగా గత అక్టోబర్‌ 21 నుంచి గడిచిన మార్చి నెలాఖరు వరకు పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకం బిల్లులను సర్కారు విడుదల చేసినవిషయం తెలిసిందే. వెన్న శాతాన్ని బట్టి బర్రె పాలకు లీటరుకురూ.40 నుంచి రూ.50ల చొప్పున, ఆవు పాలకు రూ.22 నుంచి రూ.26లు చొప్పున చెల్లిస్తున్నారు. పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై బర్రెలు అందించడం శుభపరిణామం. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదనడానికి ఇదే నిదర్శనం. రూ.80వేల విలువ చేసే బర్రెను ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 75శాతం, బీసీ, ఓసీలకు 50శాతం సబ్సిడీపై అందిస్తున్నది. ఈ నేపథ్యంలో విజయడైరీలో పాలు పోసే రైతులంతా తాము చెల్లించాల్సిన వాటా మొత్తాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి.