పాడి సమాఖ్యలో కొత్త రైతులకు సభ్యత్వం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): కొత్తగా జిల్లాలోపాడి రైతులకు సభ్యత్వం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు.  ఉమ్మడి జిల్లాలో పాడి రైతుల సొసైటీలను ఏర్పాటు చేస్తున్నారు. గత అక్టోబర్‌ 21 నుంచి గడిచిన మార్చి నెలాఖరు వరకు పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహం బిల్లులను సర్కారు విడుదల చేసింది.ప్రతి లీటరు రూ. 4చొప్పున అదనంగా చెల్లిస్తున్నది. ఈ లెక్కన ఐదు నెలల పది రోజులుడబ్బులు విడుదలయ్యాయి. వీటిని రైతుల వారీగా ఖాతాల్లో జమ చేశారు. విజయ డెయిరీ ద్యారా రూ.4 ప్రోత్సాహకం తీసుకుంటున్న రైతులకు సబ్సిడీ బర్రెలను అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంపై జిల్లాలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 7 పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 9 సొసైటీలు ఉండగా.. 117మంది రైతులు ఉన్నారు. మంచిర్యాలలో 27 సొసైటీలకు గాను 1045మంది రైతులు ఉండగా.. ఎస్సీ 53మంది, ఎస్టీ 22మంది, ఇతర రైతులు 970మంది ఉన్నారు. నిర్మల్‌లో 61 సొసైటీలకు గాను 2232మంది రైతులు ఉన్నారు. ఇందులో ఎస్సీ రైతులు 294మంది ఉండగా.. ఎస్టీ 147మంది ఉన్నారు. వీరి నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేంద్రాల్లో పాలను సేకరిస్తున్నారు. విజయడెయిరీకి పాలు విక్రయిస్తున్న 2409 మంది రైతులకు మొదటి విడతలో సబ్సిడీ గేదెలను రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. పాడి పరిశ్రమ సంఘాల్లో సభ్యత్వ నమోదు చేసుకుంటుకున్న రైతులకు రెండో విడుతలో ఇవ్వనున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాడి రైతుల నుంచి 7 కేంద్రాల ద్వారా విజయ డెయిరీ వారు రోజుకు 20 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. వెన్న శాతాన్ని బట్టి బర్రెపాలకు లీటరుకు రూ.40 నుంచి రూ. 50, ఆవు పాలకు రూ. 22 నుంచి రూ.26ల చొప్పున
చెల్లిస్తున్నారు. ప్రస్తుతం బర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ.4 చొప్పున అదనంగా అందిస్తున్న విషయం తెలిసిందే.