పాతరుణాల కింద జమచేసుకున్న రైతుబంధు డబ్బులు

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రైతుబంధు పథకం కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న డబ్బులను నవాబ్‌పేట మండల కేంద్రంలోని ఎస్‌బీఐ శాఖ అధికారులు పాత అప్పు కిందకు జమ చేసుకున్నారు. మండలంలో సుమారు 15 వేల రైతుల ఖాతాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల ఎకరాకు

రూ.4 వేలు చొప్పున యాసంగి డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. విషయం తెలుసుకున్న అన్నదాతలు డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లగా పాత రుణాల డబ్బులను వసూలు చేసినట్లు తెలిసింది. మండలంలోని లోకిరేవ్‌, అశ్రీపూర్‌ గ్రామాల రైతుల డబ్బులను అప్పుకిందకు జమ చేసుకున్నట్లు ఆయా గ్రామాల లబ్దిదారులు వాపోయారు. అయితే బ్యాంకులో డబ్బు పడగానే ఆటోమేటిక్‌గా బడ్డు రికవరీ కిందకు పోతుందని సమాచారం. గతంలో రుణమాఫీకింద వచ్చిన డబ్బు కూడా ఇలానే పలు జిల్లాల్‌లో సర్దుబాటు చేసుకున్నారు.