పాత సర్పంచ్‌లనే కొనసాగించాలి

సమస్యలను కెసిఆర్‌ దృష్టికి తీసుకుని వెళతానని హావిూ

జగిత్యాల,జూలై18(జ‌నం సాక్షి): తమ పదవి కాలం పూర్తవుతున్నప్పటికీ గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని సర్పంచ్‌ లుగానే కొనసాగించాలని జగిత్యాల జిల్లా సర్పంచులు నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత కు విజ్ఞప్తి చేశారు. దీనిపై సిఎం కెసిఆర్‌తో మాట్లాడుతానని ఎంపి కవిత హావిూ ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన సర్పంచ్‌లు కూడా ఇదే డిమాండ్‌ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన సర్పంచులు ఆ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దురిశెట్టి రాజేష్‌ నేతృత్వంలో హైదరాబాదుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా సర్పంచులు ఎంపి కవితకు తమ పరిస్థితిని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి సర్పంచ్‌ లుగా పనిచేసే అవకాశం కలిగినందుకు మాకు ఆనందంగా ఉందని అన్నారు. అయితే ఒక ఏడాది పాటు ఉమ్మడి ఏపీలో పనిచేయడం దురదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రజారంజకమైన పాలనను చూసి ఇతర పార్టీలను వదిలి టిఆర్‌ఎస్‌ లో చేరామని కొందరు సర్పంచ్‌ లు తెలిపారు. మున్సిపాలిటీల్లో విలీనమైన పంచాయతీల నిధులను నిలిపివేశారని, ఇది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని కొందరు సర్పంచులు వివరించారు. ఆ నిధులను విడుదలయ్యేలా చూడాలని కోరారు. పర్సన్‌ ఇన్‌ ఛార్జ్‌ లను నియమించడం వల్ల పూర్తిస్థాయిలో గ్రామాల పరిపాలన అస్తవ్యస్తంగా తయారవుతుందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక గ్రామ కార్యదర్శి ఉన్న పరిస్థితిని వివరించారు. ఈ విషయాలన్నింటిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ కవిత సర్పంచ్‌ లకు తెలిపారు.