పారిశ్రామికవాడ ఏర్పాటుకు చర్యలు

పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు
కామారెడ్డి,మే12(జ‌నం సాక్షి): కొత్త జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కామారెడ్డి లాంటి కొత్తజిల్లాకు పరిశ్రమల ఏర్పాటు ఎంతో అవసరం. రాష్ట్ర రాజధానికి సవిూపంగా ఉండడంతో పాటు జాతీయరహదారి, రైల్వేలైన్‌ ఉండడంతో పరిశ్రమలు త్వరగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలు తరలివస్తేనే ఉద్యోగ, ఉపాధి దఅవకాశాలు పెరుగుతాయి. రాష్ట్ర రాజధానికి కేవలం వంద కి.విూ.ల దూరంలో ఉన్న కామారెడ్డి జిల్లాపై పలువురు పారిశ్రామికవేత్తలు దృష్టిసారించారు.
అయితే రసాయన పరిశ్రమల ఏర్పాటును ఈ ప్రాంత ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో వ్యతిరేకిస్తున్నారు. రసాయన పరిశ్రమల నిర్వాహకులు వ్యర్థాలను భూమిలో వదిలేయడంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. పరిశ్రమల పరిసరాల్లో గాలి కలుషితమవుతోంది. ఇప్పటికే తలమడ్లలో భూగర్భ జలాలు రంగు మారుతున్నాయంటూ రైతులు ఆరోపిస్తున్నారు. అంతంపల్లి వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కల ఎదుగుదల లోపించినట్లు పలువురు పేర్కొంటున్నారు. రసాయన పరిశ్రమల ఏర్పాటు గురించి అధికారులు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.  తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు నెల రోజుల్లోనే అనుమతులు ఇవ్వడం కోసం నూతనంగా టీఎస్‌ఐపాస్‌ విధానాన్ని అమలులోకి తెచ్చింది. పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్‌ఐపాస్‌లో దరఖాస్తు చేసుకుంటే ఇక్కడి నుంచే సంబంధిత శాఖలకు అనుమతులు ఇస్తాయి. ఇప్పటికే 35 పరిశ్రమల ఏర్పాటు కోసం టీఎస్‌ఐపాస్‌లో దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ పరిశ్రమల ఏర్పాటు కోసం వివిధ శాఖలు ఇవ్వాల్సిన  క్లియరెన్సుల పూర్తయ్యాయి. కొత్తగా వస్తున్న పరిశ్రమలన్నీ భిక్కనూరు, కామారెడ్డి, రాజంపేట, దోమకొండ మండలాల్లోనే ఏర్పాటవుతున్నాయి. ఆయా పరిశ్రమల ఏర్పాటు కోసం ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా సోలార్‌
పరిశ్రమలు అధికసంఖ్యలో తరలిస్తున్నాయి. కామారెడ్డి, తాడ్వాయి, రాజంపేట మండలాల్లో సోలార్‌ పవర్‌ప్లాంట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 35 పరిశ్రమల్లో 12 పరిశ్రమలు సోలార్‌ పవర్‌ప్లాంట్లే కావడం గమనార్హం. ఇవేకాకుండా పౌల్టీ పరిశ్రమ మరింత వేగంగా విస్తరిస్తుంది. జిల్లాకు పారిశ్రామికవాడ మంజూరైన
విషయం విదితమే.. దానిని భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని 237 సర్వే నంబరులో ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదిలావుంటే జిల్లాకు మంజూరైన పారిశ్రామికవాడ నిర్మాణం కోసం జంగంపల్లి వద్ద భూముల సర్వే పూర్తయిందని జిల్లా పరిశ్రమలశాఖ ఎండీ శ్రీనివాసులు తెలిపారు.  సుమారు 110 ఎకరాల భూమి లభ్యమైంది. దీనిని తెలంగాణ పరిశ్రమల శాఖకు అప్పగిస్తాం. మొదటి దశలో మౌలిక సదుపాయాల కల్పన తర్వాత పరిశ్రమలు ఏర్పాటవుతాయి. భూముల లభ్యతను బట్టి పరిశ్రమలు  విస్తరిస్తామన్నారు. ముందుగా 500 ఎకరాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు చేయాలని భావించారు. జంగంపల్లి వద్ద జాతీయ రహదారికి ఆనుకొని సుమారు 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే అందులో కొంత భూమిని పేదలు సాగు చేసుకోవడానికి పంపిణీ చేశారు. పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం జిల్లా అధికారులు భూములను సర్వే చేయించారు. ఇటీవలే సర్వే పూర్తి చేయగా అందులో ఎలాంటి వివాదాలు లేని 110 ఎకరాల భూములు ఉన్నట్లు తెలింది. దీంతో ఈ భూములను త్వరలో తెలంగాణ పరిశ్రమల శాఖకు అప్పగించనున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా లే-అవుట్‌ చేసి తర్వాత రోడ్లు, విద్యుత్తు సౌకర్యం కల్పించనున్నారు.
…………………..