పారిశ్రామికవేత్త రాంప్రసాద్‌ హత్యకేసులో ట్విస్ట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసు మరో ట్విస్టు తీసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో హంతకుని కోసం ఓవైపు పోలీసులు వెతికారు. అదే సమయంలో తామే హత్య చేశామంటూ మరోవైపు ముగ్గురు వ్యక్తులు మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. పాత గొడవల కారణంగానే మర్డర్ చేశామే తప్ప.. దీని వెనుక మరెవరూ లేరని చెప్తున్నారు. దీంతో శ్యామ్‌ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఐతే ఈ మర్డర్ కేసులో కోగంటి సత్యం ప్రమేయం ఉందని భావిస్తున్న నేపథ్యంలో.. హఠాత్తుగా ముగ్గురు వ్యక్తులు తెరపైకి రావడం.. తామే హత్య చేశామని ఒప్పుకోవడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు అసలు విషయాన్ని తేల్చే దిశగా  పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య తరువాత.. హైదరాబాద్ నడిబొడ్డున మరో పారిశ్రామికవేత్త మర్డర్ కేసు సంచలనంగా మారింది. శనివారం రాత్రి 8 గంటలకి పారిశ్రామికవేత్త రాంప్రసాద్ ను కొంత మంది కత్తుల తో పొడిచి చంపారు. పాత కక్షలే కారణమై ఉంటాయని భావించిన పోలీసులు.. మూడు రోజులుగా వివిధ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాల విజువల్స్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ జరుగుతోంది. రాంప్రసాద్ హత్యకు మరో పారిశ్రామిక వేత్త కోగంటి సత్యమే కారణమంటూ.. హతుని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోగంటి కోసం పోలీసులు గాలించారు. ఐతే రాంప్రసాద్‌ హత్య కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదంటూ అజ్ఞాతంలో ఉన్న సత్యం మీడియా ముందుకు వచ్చాడు.  గతంలో మీనాక్షి స్టీల్స్ అనే కంపనీలో పాట్నర్ గా పని చేసి నష్టపోయానని.. రాంప్రసాద్ 4 కోట్ల రూపాయలు బాకీ కూడా ఉన్నాడని చెప్తున్నాడు. రాంప్రసాద్ ను చంపితే తనకు రావాల్సిన భారీ మొత్తం రాదు కదా అంటున్నాడు. ఏదేమైనా రాంప్రసాద్ ను చంపాల్సిన అవసరం తనకు లేదని.. అతని కుటుంబ సభ్యుల ఆరోపణల్లో నిజం లేదని చెప్తున్నాడు.

ఇదే సమయంలో రాంప్రసాద్ మర్డర్ కేసు అనూహ్యంగా కీలక మలుపు తిరిగింది. రాంప్రసాద్ ను తానే చంపానంటూ శ్యామ్ అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చి నేరం ఒప్పుకున్నాడు. గతంలో తనను అకారణంగా జైలుకి పంపించాడని, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా కేసులు పెట్టి వేధించాడని చెప్పాడు. ఆ కక్షతోనే చోటూ, నరేష్‌తో కలిసి రాంప్రసాద్ ను మర్డర్ చేశానన్నాడు. అంతేకాదు రాంప్రసాద్ అల్లుడు శ్రీనివాస్ కూడా అతన్ని చంపితే 15 లక్షలు ఇస్తానన్నట్లు తెలిపాడు.

మరోవైపు కోగంటి సత్యమే హత్య చేశాడంటూ రాంప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా.. శ్యామ్‌ నేరం ఒప్పుకోవడం వెనుక వేరేదో కారణం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్యామ్‌తోపాటు చోటూ, నరేష్‌ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కోగంటి సత్యం ఓ పథకం ప్రకారం శ్యామ్ అండ్ టీమ్ ను లొంగిపోయేలా చేసి, ఈ కేసులో క్లీన్ చిట్ పొందాలని చూస్తున్నాడన్న డౌట్ వ్యక్తం అవుతోంది. దీంతో కోగంటి సత్యం ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే రాంప్రసాద్ ను హత్య చేసింది శ్యామేనని తనకు తెలియదంటోంది అతని భార్య వరలక్ష్మీ. రాంప్రసాద్ పెట్టిన కేసులతో విసిగిపోయామని.. ఆర్థికంగా, మానసికంగాను చాలా దెబ్బతిన్నట్లు చెప్పింది. కోగంటి సత్యం సహకారంతో వ్యాపారం చేసుకుంటున్నామే తప్ప.. అతనితో ఎలాంటి సంబంధం లేదంది వరలక్ష్మీ. కోర్టులో వాయిదా ఉందంటూ శ్యాం మూడు రోజుల క్రితం బయటికి వెళ్లినట్లు తెలిపింది…స్పాట్

ఇక పోలీసులు అసలు దోషులను పట్టుకునే దిశగా నలుగురు నిందితులను వేర్వేరుగా విచారిస్తున్నారు. కోగంటి సత్యం, శ్యామ్, చోటూ, నరేష్‌ ను.. టాస్క్ ఫోర్స్, పంజాగుట్ట పోలీసులు విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. ఐతే రాంప్రసాద్ హత్య కేసులో కోగంటి సత్యంను తప్పించడానికే డ్రామాకి తెర లేపారా? లేక వేరే కారణాలేవైనా ఉన్నాయా ? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.