పారిశ్రామిక ప్రాంతాల్లో  మౌళిక వసతుల కల్పన 

హైదరాబాద్‌,జనవరి9(జ‌నంసాక్షి ):  పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేసేందుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వినూత్న పంథాను చేపట్టింది. భూములను కేటాయించిన వెంటనే
పరిశ్రమల స్థాపించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 వేల ఎకరాలను సిద్ధం చేసింది. రహదారులు, విద్యుత్‌, నీటి సరఫరా వంటి మౌలిక వసతులను కల్పించింది. పారిశ్రామిక సంస్థలకు ఇప్పటి వరకు భూములను కేటాయించడం వరకే ప్రభుత్వం శ్రద్ధ తీసుకునేది. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్దికి సంబంధించి ఇప్పటికే 1.60 లక్షల భూ బ్యాంకును టీఎస్‌ఐఐసీ గుర్తించింది. భూ బ్యాంక్‌ పేరుతో వీటిని సేకరించి పెట్టారు. ప్రతి జిల్లాలో ఇలా భూమిని గుర్తించి, వాటిని పారిశ్రామాకి మౌళిక వసతులకు కేటాయిస్తారు. మౌలిక వసతుల కల్పన సమాచారాన్ని త్వరలో టీఎస్‌ఐఐసీ వెబ్‌సైట్‌లో చేర్చనుంది. పారిశ్రామికవేత్తలు వీటిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఇందులో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, రైల్వే మార్గాలు, జాతీయ రహదారులకు సవిూపంలోని స్థలాలలో అభివృద్ధి పనులను చేపట్టింది. మొదటి దశలో రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల వద్ద ఏర్పాటు చేయనున్న హైదరాబాద్‌ అంతర్జాతీయ ఔషధనగరి  వద్ద ఆరువేల ఎకరాలు, జహీరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్‌)లో మూడువేల ఎకరాలు, వికారాబాద్‌, మేడ్చల్‌, యాదాద్రి, మెదక్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాల్లో మౌలిక వసతులు కల్పించింది. ఈ స్థలాలను జాతీయ రహదారులకు,. రాష్ట్ర రహదారులకు అనుసంధానం చేశారు. విద్యుత్‌ లైన్లను ఏర్పాటు చేశారు. అంతర్గత రహదారులను సిద్ధం చేశారు. మంచినీటి సరఫరా వ్యవస్థను కల్పించారు. టెలికమ్యూనికేషన్స్‌ కోసం ్గ/బైర్‌ కేబుళ్లను సైతం వేశారు. పారిశ్రామికవేత్తలు తమకు కేటాయించిన భూముల ప్రాతిపదికన భవన నిర్మాణాల ప్రణాళికలను తయారు చేసుకొని పనులను చేపట్టవచ్చు. మౌలిక వసతుల కల్పన ద్వారా పారిశ్రామికవేత్తలకు అన్ని
రకాలుగా వెసులుబాటు కలగనుంది. కేటాయింపుల సమయంలో మౌలిక వసతుల వివరాలను పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం వివరిస్తుంది. గతంలో పరిశ్రమల స్థాపనకు రెండేళ్ల వరకు గడువు ఇచ్చేవారు. ఇప్పుడు మౌలిక వసతుల కల్పన దృష్ట్యా ఈ గడువును తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. తమకు కేటాయించిన స్థలానికి సరైన సౌకర్యాలు లేవంటూ పనులను చేపట్టేవి కావు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సాకుతో భారీ ప్రాజెక్టులు ప్రారంభం కాలేదు. దీంతో వేల ఎకరాల భూములు నిరుపయోగంగా ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితిని నివారించేందుకు టీఎస్‌ఐఐసీ పూనుకుంది. పరిశ్రమల స్థాపనకు గుర్తించిన భూములకు ముందే అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి, ఆ తర్వాత వాటిని కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.200 కోట్లతో మౌలిక వసతులను చేపట్టింది.