పార్టీకి వేయి విరాళం ప్రకటించిన ప్రధాని మోడీ


పార్టీని సొంత విరాళాలతో నడపడమే బెటర్‌ అన్ని అమిత్‌ షా
న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోదీ రూ.వెయ్యి విరాళం ఇచ్చారు. అయితే ఇంత తక్కువ విరాళం ఇవ్వడం ద్వారా వాళ్లు ఓ సందేశాన్ని కూడా పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. పార్టీని నడిపించడానికి బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, నల్లధనంపై ఆధారపడే పరిస్థితి పోవాలని, విరాళాల్లో ఓ పారదర్శకత రావాలని అమిత్‌ షా పిలుపునిచ్చారు. దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ 51వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఓ పార్టీ కార్యక్రమంలో అమిత్‌ షా ప్రసంగించారు. విరాళాల విషయంలో మిగతా పార్టీలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అంతకుముందే మోదీతో కలిసి ఆయన పార్టీ యాప్‌ ద్వారా రూ.వెయ్యి విరాళాన్ని అందజేశారు. పార్టీ కార్యకర్తలంతా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నా. నమో యాప్‌ ద్వారా సులువుగా ఈ పని చేయొచ్చు. నేను నా వంతు విరాళం ఇచ్చాను అని మోదీ ట్వీట్‌ చేశారు. మన డబ్బుతో ఈ పార్టీ నడిపిద్దాం కానీ బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, బిల్డర్ల సొమ్ముతో కాదు అని అమిత్‌ షా అన్నారు. వీళ్ల డబ్బుతో పార్టీ నడిస్తే అప్పుడు స్వచ్ఛంగా ఉండలేదని, తన లక్ష్యాలను చేరుకోలేదని ఆయన స్పష్టంచేశారు.  ఎన్నికల కోసం దాతల నుంచి పార్టీ సేకరించే విరాళాల విషయంలో పారదర్శకత ఉండాలని అమిత్‌ షా తమ కార్యకర్తలకు సూచించారు. విరాళాల విషయంలో ఇతర పార్టీలకు మన పార్టీ.. మార్గదర్శకంగా ఉండాలి. అయితే, వచ్చే మొత్తం మన పార్టీ నిర్వహణ, ఎన్నికల ఖర్చులకు సరిపోతాయని నేను చెప్పలేను.  ప్రస్తుతానికి ఇది సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించారు. ‘విరాళాల విషయంలో మనం పారదర్శకంగా ఉండకపోతే మన లక్ష్యాలు చేరుకోవాల్సిన మార్గాలు సరిగ్గా ఉండవు. పార్టీ చాలా స్వచ్ఛంగా ఉండాల్సి ఉంటుందన్నారు.  రాజకీయాల్లో నల్లధనాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ప్రధాని మోదీ ప్రభుత్వం… నేరుగా నగదు రూపంలో
ఇచ్చే విరాళాలను రూ.2,000కే పరిమితం చేసింది. ఇందుకు తగ్గట్లు చట్టాన్ని కఠినంగా రూపొందించింది. మరోవైపు కుంభకోణాల్లో భాగస్వాములుగా ఉన్న వారు కూడా మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో చలికాలంలో కూడా ఉక్కపోతకు గురవుతున్నారు. తమను జైల్లో పెడతారన్న భయంతో పారిశ్రామిక వేత్తలు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ వంటి వారు దేశం వదిలి పారిపోయారు’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.