పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి శివైక్యం

సంతాపం ప్రకటించిన సిఎం కెసిఆర్‌

ఆయన మృతి తీరని లోటన్న ప్రముఖులు

హైదరాబాద్‌, ఆగస్టు9(జ‌నం సాక్షి) : ప్రముఖ పండితుడు, పంచాంగకర్త, దశాబ్దాలపాటు సిద్ధాంతిగా సేవలందించిన బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహ రామ సిద్ధాంతి (94) గురువారం ఉదయం శివైక్యం చెందారు.ఆయన మృతికి సిఎం కెసిఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయ పరమ విద్వాంసుడని కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, డాక్టర్‌ ఎస్‌. వేణుగోపాలాచారి, సిఎం కెసిఆర్‌ ఓఎస్‌డి దేశిపతి శ్రీనివాస్‌,అర్చకసంఘం అధ్యక్షుడు గంగు భానుమూర్తి పలు బ్రాహ్మనసంఘాల సభ్యులు సంతాపం ప్రకటించారు. నృసింహ రామ సిద్ధాంతి స్వస్థలం జనగామ జిల్లాలోని కొడకండ్ల గ్రామం. కొడకండ్ల సిద్ధాంతిగా ఆయన పేరు తెలుగువారికి సుపరిచితులు. వృద్ధాప్యం కారణంగా ఆయన తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి 90 ఏళ్ల వయసులోను అలుపెరగకుండా ఆధ్యాత్మిక సేవలను కొనసాగించారు. ఆయన సేవలను గుర్తించిన ‘దర్శనం’ ఆధ్యాత్మిక మాస పత్రిక తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా ఆయనను సత్కరించింది. రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి జీవన సాఫల్య పురస్కారం, ధార్మిక వరేణ్య బిరుదును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా పాల్గొని ఆయనకు స్వర్ణ కంకణాన్ని తొడిగారు. ఆపై, ఆయన్ను పల్లకీలో ఉంచి స్వయంగా మోశారు. కేసీఆర్‌ నిర్వహించిన అయుత చండీయాగం కూడా కొడకండ్ల సిద్ధాంతి చేతుల విూదుగానే జరిగింది. 1925 జులై 20న కొండకొండ్లలో జన్మించిన నృసింహ సిద్ధాంతికి తెలుగు, హిందీ, సంస్కతం భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఇప్పటి వరకు 2,400 ఆలయాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వైదిక విద్య, జ్యోతిష్యాలలోనూ ప్రావీణ్యం కలిగిన నృసింహ సిద్ధాంతి ధర్మప్రచారం, ఆధ్యాత్మిక సేవలలో చురుకైన పాత్ర పోషించారు. నిత్యపారాయణం, శ్రీవిద్య సాఫల్య, శ్రీవిద్య లఘుచక్ర పూజ, నిత్యాహ్నికం, రుద్ర స్వాహాకారం గ్రంథాలను రచించిన నృసింహ రామ సిద్ధాంతి ఉజ్జయని, కాశీ, వేలూరు ప్రాంతాల్లో నవచండీ ¬మం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి చందద్రబాబు నాయుడు ఉగాది పర్వదినాన విశిష్టమైన వ్యక్తిగా ఆయనను సన్మానించారు.