పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

– వచ్చే ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తుకు సిద్ధం
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
ఖమ్మం, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : దేశంలో, రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించటంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి విమర్శించారు. నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతుంటే కేసీఆర్‌ మాత్రం ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రానున్న ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తులు కుదుర్చుకునేందుకు సీపీఐ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే  తెదేపాలతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలతో తనపై ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకొనేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలతో తెరాసకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. సాంబశివరావు, జిల్లా కార్యదర్శి హేమంత్‌ రావు పాల్గొన్నారు.