పాలమూరులో కాంగ్రెస్‌ దూకుడు


ఒంటరిగానే ప్రచారంలో జోరు
అభ్యర్థుల టిక్కెట్లపై తేలని పంచాయితీ
మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):ఒక వైపు కూటమి సీట్ల అంశం కొలిక్కి రాకపోయినా కాంగ్రెస్‌ పార్టీ మాత్రం దూకుడు పెంచింది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ చైతన్య యాత్ర, ప్రజాగ్రహ సభలు పేరిట విస్తృతంగా రోడ్డు షోలు, బహిరంగసభలు నిర్వహిస్తూ కేడర్‌ను ఉత్సాహపరుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు అలంపూర్‌, గద్వాల, దేవరకద్ర, మక్తల్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, కొల్లాపూర్‌, అచ్చంపేటల్లో రోడ్డుషోలు, సభలు పూర్తయ్యాయి. అయితే, కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేసిన మహబూబ్‌నగర్‌, మక్తల్‌, జడ్చర్ల స్థానాలను కచ్చితంగా కావాలని మహాకూటమిలోని మిత్రపక్షాలు పట్టుబడుతున్నాయి. గత ఎన్నికల్లో మక్తల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందిన నేపథ్యంలో.. ఇక్కడ కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీకే టిక్కెట్టు కేటాయించాలని డిమాండ్‌ చేస్తోంది. అందుకు అనుగుణంగా మక్తల్‌లో నిర్వహించిన బహిరంగ సభల్లో వక్తలందరూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ… కూటమిలో భాగంగా త్యాగం చేయబోమని స్పష్టం చేశారు. అలాగే మహబూబ్‌నగర్‌ టిక్కెట్‌ విషయంలో కాంగ్రెస్‌ పెద్దలు కాస్త పట్టు విడుస్తున్నా… స్థానిక నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పార్టీలో ఉన్న వారిలో ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా
ఫర్వాలేదని… జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌ స్థానాన్ని మాత్రం ఇతర పక్షాలకు కేటాయించొద్దని నేతలందరూ మూకుమ్మడిగా టీపీసీసీ నేతలకు విన్నవించారు. దీంతో సీట్ల సర్దుబాటు అంశం రసవత్తరంగా మారింది. దీంతో టీఆర్‌ఎస్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా మహాకూటమి పేరిట జతకట్టిన విపక్ష పార్టీల అడుగులు అంతుచిక్కడం లేదు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌ నేతృత్వంలో టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి పార్టీలు కలిసి పనిచేయాలని సూచన ప్రాయంగా నిర్ణయించుకున్న విషయం విదితమే. ఈ మేరకు మహాకూటమిలోని మిత్రపక్షాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌కు సూచిస్తున్నాయి.అయితే, మిత్రపక్షాలు అడుగుతున్న స్థానాల విషయయమై ఇంత వరకు కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ శ్రేణులను సన్నద్ధం చేయడం కోసం ఆ పార్టీ ప్రచార కమిటీ విస్తృతంగా పర్యటిస్తూ రోడ్డుషోలు, బహిరంగ సభలతో దూసుకెళ్తోంది. అంతేకాదు మహాకూటమి అడుగుతున్న నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించడంటూ ప్రచారం చేస్తుండడం గమనార్హం. దీంతో కాంగ్రెస్‌ వ్యూహామేంటో అర్థం కాక కూటమిలోని మిత్రపక్షాల నేతలు తలలు పట్టుకుంటున్నారు.  టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలు ఉమ్మడి జిల్లాలో పలు స్థానాల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఉమ్మడి పాలమూరులో కాస్త పట్టు ఉండడంతో టీడీపీ, టీజేఎస్‌ పార్టీలు కొన్ని సీట్ల కోసం పట్టుబడుతున్నాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన టీడీపీ నుంచి చాలావరకు నేతలందరూ తలోదారిన వెళ్లిపోవడంతో ప్రస్తుతం అతి కొద్ది మంది మాత్రమే మిగిలారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో టీడీపీ నాలుగు స్థానాలు కావాలని కోరుతోంది. దయాకర్‌రెడ్డి కోసం మక్తల్‌, సీతమ్మ కోసం దేవరకద్ర, రావుల చంద్రశేఖర్‌రెడ్డి కోసం వనపర్తి, ఎర్ర శేఖర్‌ కోసం జడ్చర్ల లేదా మహబూబ్‌నగర్‌ స్థానాలను డిమాండ్‌ చేస్తోంది. దీంతో సీట్ల కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఎడతెరిపి లేకుండా జరుగుతున్న చర్చలు… ఓ కొలిక్కి రావడం లేదు.