పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: నిరంజన్‌

వనపర్తి,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): పాలమూరు జిల్లా నుంచి విడిపోయిన అన్ని జిల్లాల్లోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కల్వకుర్తి పూర్తయి నీళ్లురాగానే కాంగ్రెస్‌ నేతలు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌, టిడిపిలు పనీపాట లేకుండా రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. వనపర్తి నియోజక వర్గాన్ని ,పాలమూరు జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే తన లక్షమని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ప్రతి పక్షాలకు దీటైన సమాధానం ఇస్తామని తెలిపారు. కేఎల్‌ఐ నుండి మంగనూర్‌ కాలువ ద్వారా సాగునీరు తెచ్చి ఖిల్లాఘనపురం మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని ,కృష్ణానీటితో గట్టుకాడిపల్లి వెంకటేశ్వరస్వామి పాదలు కడుగుతానని ఆయన తెలిపారు. వివిధ ప్రాజెక్టుల ద్వారా నీరు పుష్కలంగా రావాలంటే రైతులు ఒకరికోకరు సహకరించుకోవాలని వచ్చే ఏడాది కల్లా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. రైతు కుటుంబంలోని నిరుద్యోగ యువతి,యువకులకు శిక్షణ ఇచ్చి కొలువులు సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈనాటి పిల్లలకు వ్యవసాయమంటే ఏమిటో తెలియని పరిస్థితి నెలకోందని,అన్నం పెట్టే రైతన్నా అడుక్కునే పరిస్థితికి చెరుకోవద్దన్న లక్షంతో తాను ప్రాజెక్టుల పనులను ముమ్మరం చేస్తున్నాన్నారు.