పాలేరును కోనసీమను మించి అభివృద్ది చేస్తా

సీతారామ ప్రాజెక్టుతో చెరువులను నింపుతా

ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ది

పాలేరు ప్రచారంలో మంత్రి తుమ్మల

ఖమ్మం,నవంబర్‌26(జ‌నంసాక్షి): పాలేరులో మిగిలిపోయిన చెరువుకు ఈ దఫా నీళ్లు ఇస్తమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. జిల్లాలోని ముజాహిద్‌ పురంలో మంత్రి తుమ్మల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ..ప్రతీ సెంటు భూమికి నీళ్లు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయండి, విూ గ్రామాలు, తండాల్లో రూపు రేఖలు మారుస్తానన్నారు. మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తే..అభివృద్ధిని విూ ముంగిట నిలబెడతానని తుమ్మల హావిూనిచ్చారు.కోనసీమ కంటే పాలేరు నియోజకవర్గమే మిన్నగా మారిందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కరువు ప్రాంతమైన తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్‌ తదితర మండలాల్లోని గ్రామాల్లో పచ్చని పైర్లను చూస్తుంటే గుండె నిండిపోతుందన్నారు. సీఎం కేసీఆర్‌ తోడ్పాటుతో చేపట్టిన భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతాల్లో బీడు భూములు సైతం సస్యశ్యామలంగా మారినట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో పంటలు మంచిగా పండి ప్రజలందరూ ఆనందంగా ఉంటాలనే సాగునీటి వసతి కల్పించినట్లు తెలిపారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతంలోని చెరువులను వేసవి కాలంలోనూ నీటితో నింపిస్తానన్నారు. గడిచిన నాలుగేళ్లలో నియోజకవర్గంలోని గిరిజన తండాల అభివృద్ధికి విస్తృతంగా కృషిచేసినట్లు చెప్పారు. మారుమూల తండాలకు సైతం బీటీ రోడ్లు నిర్మించినట్లు, విద్యుత్‌, తాగునీటి సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తించి వారికి స్వయంపాలన అవకాశాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రఘునాథపాలెం నుంచి గుండెపుడి, జూపెడ, కాకరవాయి వరకు బీటీ రోడ్లు నిర్మిస్తానని హావిూయిచ్చారు. పాలేరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు సమగ్ర అభివృద్ధి జరిగే వరకూ విశ్రమించనని పేర్కొన్నారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రజలు అడుగుతున్నట్లుగా అర్హులైన పేదలందరికీ సొంత స్థలాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. పాలేరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మళ్లీ ఆదరించి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.