పిఎసిఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ధర్నా

శ్రీకాకుళం,నవంబర్‌12(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం పిఎసిఎస్‌ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ విమర్శించారు. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద పిఎసిఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ నెల 14 నుంచి నిరవధిక సమ్మె దృష్ట్యా సన్నాహంగా ఈ ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి మాట్లాడుతూ.. 151 జిఒ ప్రకారం 2014 నుంచి గ్రాట్యుటీ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ పెండింగులో పెట్టడం అన్యాయమన్నారు. గ్రాట్యుటీని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. డిసిసిబి లో 50 శాతం ఖాళీలను పిఎసిఎస్‌ ఉద్యోగులతో భర్తీ చేయాలని కోరారు. అనంతరం డిసిసిబి సిఈఒ సత్యనారాయణకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ ధర్నాలో యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాథ, అధ్యక్షుడు లోలుగు మోహన రావు, కార్యదర్శి లక్ష్మి నారాయణ, సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.