పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బుద్ధి చెబుతాం

– పెద్దమనిషివని గౌరవిస్తున్నాం
– టీజీ వెంకటేష్‌వ్యాఖ్యలపై పవన్‌ మండిపాటు
అమరావతి, జనవరి23(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ లో జనసేన-టీడీపీ కలిసేందుకు అవకాశాలు ఉన్నాయన్న టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. బుధవారం ఈమేరకు స్పందించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వదిలిపెట్టబోమని, బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తాము వద్దనుకుంటేనే టీజీ వెంకటేశ్‌ కు చంద్రబాబు రాజ్యసభ సీటును ఇచ్చారని పవన్‌ అన్నారు. నా నోరు అదుపుతప్పితే విూరు ఏమవుతారో కూడా నాకు తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖ మన్యంలో టీడీపీ నేతలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ చనిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. టీజీ వెంకటేశ్‌ తన వయసుకు తగ్గట్లు పెద్దమనిషిగా మాట్లాడాలనీ, లేదంటే తాను నోరు అదుపుతప్పి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. కర్నూలులో పర్యావరణాన్ని అడ్డగోలుగా కలుషితం చేస్తున్నారని దుయ్యబట్టారు. పెద్దమనిషి అనే మర్యాద ఇస్తున్నానని అన్నారు. ఏపీని అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో తాను మద్దతు ఇస్తే టీడీపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇందుకోసం టీడీపీ నుంచి తాము ఏదీ ఆశించలేదని గుర్తుచేశారు. టీడీపీ వ్యవహారశైలితో విసిగిపోయామనీ, ఆ పార్టీ ఇప్పుడు మళ్లీ ఎలక్షన్‌ గేమ్‌ మొదలుపెట్టిందని విమర్శించారు.
చంద్రబాబు సీరియస్‌..
మరోవైపు టీజీ వెంకటేష్‌ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. జనసేనతో పొత్తులపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పాము-ముంగీసలా ఉండే ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు టీడీపీ- జనసేన పొత్తు తప్పుకాదని ఆయన అభిప్రాయపడిన విషయం తెలిసిందే. టీజీ ప్రకటన సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. టీజీ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు సరికాదని, ఈ తరహా ప్రకటనలతో అయోమయానికి గురిచేయొద్దని, పార్టీ విధానాలపై కామెంట్లు చేసేటప్పుడు నేతలు సంయమనం కోల్పోవద్దని చంద్రబాబు సూచించారు. ఎన్నికల తరుణంలో ఇలాంటి కామెంట్లతో గందరగోళం సృష్టిస్తే ఎవరికీ మంచిది కాదని
చంద్రబాబు హెచ్చరించారు. టీజీ వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు స్పందించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం తమతో పవన్‌ కలిసివస్తే స్వాగతిస్తామన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌కు ఓటేస్తే నరేంద్రమోదీకి వేసినట్టేనని చెప్పారు. జగన్మోహన్‌ రెడ్డి పొలిటీషియన్‌ కాదని, నేరస్ధుడని మండిపడ్డారు. ప్రజా సమస్యల కంటే కేసులు నుంచి ఎలా తప్పించుకోవాలన్నదే ప్రతిపక్ష నేత ఆలోచన అని ఎద్దేవా చేశారు. బీజేపీ, వైసీపీ, కేసీఆర్‌లు కలిసి ఏపీ ప్రజలకు అన్యాయం చేయాలని కుట్రలు పన్నుతున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు.