పిట్లళ్ల రాలిపోతున్న రైతులు

4

ఒకే రోజు ముగ్గురు అన్నదాతల ఆత్మహత్యలు

కరీంనగర్‌లో ఇద్దరు, ఖమ్మలో ఒకరు..

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి):

ప్రకృతి ఓవైపు కన్నెర్ర చేస్తున్నా కూడా  రాష్ట్రప్రభుత్వం ఏమాత్రం పట్టించకున్న పాపాన పోకపోవడంతో అన్నదాతలు చేసిన అప్పులు తీర్చలేక తనువులు చాలిస్తున్నారు.  ఒకే రోజు బుదవారం ఉదయం జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. సిరిసిల్ల మండలంలో ఓ కౌలు రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్ల మండలం చిన్నబోనాల గ్రామంలో చోటు చేసుకుంది., అంబటి నారాయణ(44) తనకున్న రెండెకరాల భూమితో పాటు మరో  ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని  వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఇప్పటికే సీజన్‌లో రెండుసార్లు విత్తనాలు వేసినా మొలవకపోగా చేసిన అప్పులను ఏవిధంగా తీర్చాలన్న భాధతో మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించి దుర్మరణం పాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని వివరాలుసేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంకో రైతు కాలం కలిసిరాకపోగా అప్పుల్లోనే అప్పు చేసి కుమార్తె వివాహాన్ని చేశారు. అయితే ఇకనైనా కాలం కలిసివస్తుందనే భావనతో ఉన్న ఆయనకు మూడోసారి కూడా ఎదురుదెబ్బే తగిలింది దీంతో బుదవారం పురుగుల మందు సేవించి మరణించిన సంఘటన తిమ్మాపూర్‌ మండలం పోరండ్లలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముస్కు నాగిరెడ్డి (47) రైతుకు మూడెకరాల భూమ ఉంది. అందులో ఎకరం వరివేసి మిగతా కూరగాయలు సాగు  చేస్తున్నారు. వర్షాలు లేక వేసిన పొలం ఎండిపోతుండడంతో ఆవేదనకు గురైన ఆయన తెల్లవారు జామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లారే సరికి నాగిరెడ్డి శవమై  ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. విషయాన్ని తెలుసుకున్న  పోలీసులు గ్రామాన్ని సందర్శించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంబించారు. మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం నిర్వహించారు. రెండు సంఘటనలు జిల్లాలో అన్నదాతలు ఆందోళనకు గురిచేశాయి. ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలకుపోకుండా కరువు ప్రాంతాలుగా ప్రకటించి అన్నదాతలను ఆదుకునేందుకు ప్రయత్నాలు చేయాలని ప్రతిపక్షాలు, రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలలో ఇప్పటికే తెలంగానా వచ్చిన తర్వాత 150కిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనల చోటు చేసుకున్నాయి. గత ఏడాదిన్నరగా మూడో పంటను కూడా వేసుకోలేని దుస్థితి  ఉన్నా కూడా తెలంగాణా ప్రభుత్వం మాత్రం కనికరించక పోవడంతో చివరికి బలవంతపు మరణాలవైపే పరుగులు తీస్తున్నారు అన్నదాతలు.

మండలపరిధిలోని కృష్ణాపురంలో పురుగుల మందుతాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మధిర గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం కృష్ణాపురం గ్రామానికి చెందిన తేజావత్‌ మంగ్యా (36)వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతేడాది నాలుగు ఎకరాల్లో సాగుచేసిన మిర్చి, పత్తిపంట సరైన దిగుబడి రాకపోవడంతో రూ.2లక్షల అప్పులయ్యాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఒక ఎకరం మిర్చి, రెండున్నర ఎకరాల పత్తిపంటను సాగు చేశాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పంటలు పండలేదు. ఈరోజు ఉదయం పొలం దగ్గరకు వెళ్లి పంటను పరిశీలించిన మంగ్యా మనస్తాపంచెంది ఇంటికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య జ్యోతి విషయాన్ని గమనించి మంగ్యాను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై జే.వసంత్‌కుమార్‌ తెలిపారు.