పీఎన్‌బీ కుంభకోణంలో..  మరొకరి అరెస్టు


– హాంకాంగ్‌ కంపెనీ డైరెక్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
కోల్‌కతా, నవంబర్‌6(జ‌నంసాక్షి) : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మోహుల్‌ ఛోక్సీకి సంబంధించిన ఓ వ్యక్తిని మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్టు చేశారు. హాంకాంగ్‌లోని ఛోక్సీకి చెందిన డొల్లకంపెనీలో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న దీపక్‌ కృష్ణారావ్‌ కులకర్ణిని కోల్‌కతా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారి వెల్లడించారు. సోమవారం రాత్రి కులకర్ణిపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. అయినప్పటికీ.. ఆయన దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు అరెస్టు చేశారు. అతడిని ప్రస్తుతం విచారణ నిమిత్తం రిమాండ్‌కు పంపించారు. హాంకాంగ్‌లోని ఛోక్సీ డవ్మిూ కంపెనీల్లో ఒకదానికి కులకర్ణి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఛోక్సీపై నమోదైన ఛార్జిషీట్‌లో కులకర్ణి పేరు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పీఎన్‌బీకి రూ.13వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నీరవ్‌ మోదీ, ఛోక్సీలను పట్టుకునేందుకు భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు. విదేశాల్లో తలదాచుకుంటున్న వారిని భారత్‌ రప్పించేందుకు ఈడీ, సీబీఐ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరికి చెందిన పలు ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నీరవ్‌ మోదీపై ఇంటర్‌పోల్‌ అధికారులు రెడ్‌ కార్నర్‌ నోటీసులు సైతం జారీ చేశారు.