పునాదులను పెకిలిస్తున్న ప్రియాంక 

యూపి ఎన్నికల ప్రచారంలో ప్రియాంక మెల్లగా చొచ్చకురని పోతున్నారు. ప్రజల నాడిని పసిగట్టి ప్రచారం చేస్తున్నారు.  నేరుగా వారివద్దకు వెళ్లి మాట్లాడడం, మోడీ వైఫల్యాలను నేరుగా ప్రస్తావించడం వంటి పనులు చేస్తున్నారు. దీంతో ప్రజల్లో కూడా ఇప్పుడామె ప్రచారానికి బాగా స్పందన వస్తోంది. ఇది ఓ రకంగా మోడీకి, సిఎం యోగికి సవాల్‌ లాంటిదే. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో 71 సీట్లు గంపగుత్తగా సంపాదించిన బిజెపి కోటను ప్రియాంక గండి కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఎస్పీ,బిఎస్పీ కూటమి కూడా దెబ్బతినేలా కనిపిస్తోంది. అందుకే మాయావతి,అఖిలేశ్‌ యాదవ్‌లు కూడా ప్రియాంక ప్రచారాలపై గాభరా పడుతున్నారు. ప్రియాంక తమ ఓట్లను చీలుస్తోందని, ఆమె బిజెపికి మేలు చేస్తోందన్న వాదన తెరపైకి తెచ్చారు. గతంలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభావం బాగా ఉండేది. ఈ మూడేళ్లలో ఆయన ప్రభావం తగ్గింది. ఇదే ఇప్పుడు ప్రియాంకకు కలసి వస్తోంది. దేశంలో మెజార్టీ ఎంపి సీట్లు యూపిలో సాధించిన వారికే కేంద్రంలో అధికారం దక్కడం ఖాయం. అందుకే రాహుల్‌ తన సోదరి ప్రియాంకను తెలివిగా అక్కడ ప్రచారంలో దింపారు. యూపిలో బిజెపిని దెబ్బకొట్టడం లక్ష్యం అయినా ఇప్పుడు పరోక్షంగా ఎస్పీ,బిఎస్పీ కూటమికి కూడా గండి పడుతోందన్న భయం కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్‌ ఏ మేర లబ్దిపొందుతుందో ఫలితాల తరవాత తేలనుంది. అందుకే ప్రియాంక తన చతురతతో ముందుకు సాగుతున్నారు. మోడీకి దీటుగా వాగ్బాణాలు వదులుతున్నారు. ఈ ఎన్నికల్లో వారణాసిలో నరేంద్రమోదీపై పోటీ చేయనందుకు బాధ పడుతున్నారా అన్న ప్రశ్నకు,తనకు ఎవరన్నా భయం లేదని.. పాములను ఆడిస్తూ ముక్కుసూటిగానే  అన్నారు. యూపీలో పార్టీని బలోపేతం చేయడం ముఖ్యమని, తన కోసం ప్రచారం చేసుకోవడం కంటే కాంగ్రెస్‌ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడం అవసరమని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు అఖిలేశ్‌ కూడా భయపడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాకు మేలు చేసేందుకు బలహీన అభ్యర్థులను బరిలోకి దించారన్న అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపణలను  కూడా ప్రియాంకా గాంధీ ఖండించారు. భాజపాకు ప్రయోజనం కలిగించడం కంటే మరణించ డమే మేలని ఆవేశంగా అన్నారు. గట్టిగా పోటీ చేయగలిగేవాళ్లు లేదా భాజపా ఓట్లను చీల్చుకోగలిగే వారినే ఉత్తర ప్రదేశ్‌లో అభ్యర్థులుగా తాము ఎంచుకొన్నామని చెప్పారు. తమ పార్టీ లేదా అభ్యర్థి బలంగా ఉన్న చోటే పోరాడుతున్నామని, తాము భాజపా ఓట్లను చీల్చుకుని గెలుస్తాం తప్ప ఎస్పీ-బీఎస్పీ కూటమివి కావని అన్నారు. ఈ విషయంలో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ చేసిన ఆరోపణలను ఖండించారు. 2022లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏర్పడబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జాతీయవాదమంటే ప్రజల పట్ల, దేశం పట్ల ప్రేమ అని… కానీ భాజపా విషయంలో ఆ రెండూ కనిపించడం లేదని ప్రియాంక ఎదురుదాడికి దిగుతూ తన ప్రాచరాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాస్తవ సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని, ప్రజలగొంతు నొక్కేస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రజాగ్రహం తీవ్రస్థాయిలో ఉందని, మోదీకి దేశం మే 23న ఒక సందేశం ఇస్తుందని కూడా గట్టిగానే చెబుతున్నారు. అంటే ఫలితాల్లో మోడీ వెనకబడి పోతారన్న భావన ప్రజల్లో కల్పిస్తున్నారు.  ప్రజలు మాట్లాడేటప్పుడు వినడం, ప్రజాస్వామ్యయుతంగా ఉండడం, వ్యవస్థలను బలోపేతం చేయడం లాంటివే ఏ ప్రభుత్వానికైనా, ఏ నాయకుడికైనా అత్యంత ముఖ్యమని.. అంతేతప్ప వాటిని బలహీనం చేయడం కాదని ఆమె చెప్పారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజా గ్రహానికి కారణం అవుతున్నాయని ప్రియాంక పదేపదే చెబుతున్నారు. తాను ఎక్కడికెళ్లినా ప్రజాగ్రహం, ప్రజల బాధ కనిపిస్తున్నాయని.. వాటిని ఇంతవరకు ఈ ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. మోదీ అయినా..
వేరే నాయకుడు ఎవరైనా కూడా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, వారి గొంతు నొక్కేస్తుంటే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని, ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తోందని ఆమె చెప్పారు. మొత్తంగా యూపిలో ఓ రకంగా ప్రియాంక రాక అటు బిజెపికి ఇటు ఎస్పీ,బిఎస్పీ కూటమికి గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే మోడీ కూడా యూపి ఎన్నికల ప్రచారంలో బాగానే చెమటోడుస్తున్నారు. కాంగ్రెస్‌ను ప్రధానంగా కుటుంబ రాజకీయాలను ఆయన వేలెత్తి చూపుతున్నారు. కాంగ్రెస్‌లో మరొకరికి అధ్యక్షపీఠం ఇవ్వగలరా అని ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల ప్రచారం లో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలంటూ యువతను ఆకట్టుకున్న మోదీ ఇప్పుడు వారి ఓటు తనకు గాక సైనిక దళాలకు వేయాలని చెబుతున్నారు. ఈ విధంగా సైన్యాన్ని ఎన్నికల ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా జాతీయవాదం తెరపైకి తెచ్చారు. భారత సైన్యాన్ని మోదీసేన అన్నందుకు బిజెపి నేతలు యోగి తదితరులకు అక్షింతలు పడ్డాయి. కాశ్మీర్‌ అంశాన్ని కూడా బాగా ప్రచారంలో పెట్టారు. 370 ఆర్టికల్‌ రద్దు చేస్తామని అన్నారు. దేశాన్ని ముక్కలు కానివ్వమని, ముఫ్తీలు, అబ్దుల్లాల కుట్రలకు దేశం విచ్ఛిన్నం కానివ్వమని పరోక్షంగా కాశ్‌ఈమర్‌ నేతలకు హెచ్చరిక చేశారు.  నరేంద్ర మోదీ లలిత్‌ మోదీ నీరవ్‌ మోదీ ఇలా అందరూ దొంగలేనని రాహుల్‌ అనడంతో మోదీలను అవమానించారని గగ్గోలు పెట్టారు. చాయ్‌ వాలా నినాదం వదిలేసి చౌకీదార్‌ నినాదం ముందుకు తెచ్చారు. ఎన్నికల ప్రణాళికలో మరోసారి వెనక్కు పోయి రామమందిర నిర్మాణం, కాశ్మీర్‌ 370వ అధికరణం రద్దు వంటి పాత పాటలను మళ్లీ ఎత్తుకున్నారు. అయితే, మోదీ విధానాల వల్ల కోట్లమంది నిరుద్యోగం పాలు కావడం, వ్యవసాయ వ్యాపారాలు చితికిపోవడంతో ఈ ఉద్వేగాలు గతంలో వలె పనిచేయవని తేలిపోయింది. అందుకే అయోధ్యకు వెళ్లి కూడా రామమందిరం మాటెత్తకుండా వెనుతిరిగారు. మొత్తంగా ఇప్పుడు యూపిలో ఫళితాలు రేపటి దేశ నేత ఎవర్నదానిపై ప్రభావం చూపనున్నాయి. అలాగే బిజెపి గండికోట అయిన యూపిలో ప్రియాంక తప్పకుండా ప్రభావం చూపుతుందన్న స్పష్టత కనిపిస్తోంది. ఇది ఎంతమేరకు ఉంటుందన్నది ఫలితాలతో తేలనుంది.