పుల్వామాలో ఉగ్రదాడి కాదు.. యాక్సిడెంట్‌!

– ఎంతమంది ఉగ్రవాదులు మరణించారో మోదీ వివరనివ్వాలి
– కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మార్చి5(జ‌నంసాక్షి) : పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న భీకర ఉగ్రదాడిని ప్రమాదంగా పేర్కొంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం హిందీలో ట్వీట్‌ చేశారు. ఫిబ్రవరి 26న ఐఏఎఫ్‌ చేపట్టిన వైమానిక దాడులపైనా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. వైమానిక దాడులపై కొన్ని విదేశీ విూడియా సంస్థలు సందేహాలు వ్యక్తం చేశాయనీ.. భారత ప్రభుత్వ విశ్వసనీయతపై ఇది ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆయన అన్నారు. పుల్వామా ఉగ్రదాడికి కారణమైన పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ స్థావరాలపై ఐఏఎఫ్‌ నిర్వహించిన మెరుపు దాడులు, మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘ఏదేమైనా, పుల్వామా ‘దుర్ఘటన’ తర్వాత ఐఏఎఫ్‌ నిర్వహించిన వైమానిక దాడులపై కొన్ని విదేశీ విూడియా సంస్థలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని, ఇది మన భారత ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పుల్వామా ఉగ్రదాడిని ప్రమాదంగా పేర్కొనడాన్ని తప్పుపడుతూ నెటిజన్లు దిగ్విజయ్‌ సింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జరిపిన వైమానిక దాడుల్లో ఐఏఎఫ్‌ ఎంత మంది ఉగ్రవాదులను చంపిందో దిగ్విజయ్‌ ప్రశ్నించారు. 250 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామంటూ బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, 400 మందిని చంపామంటూ యూపీ సీఎం యోగి, ఒక్కరు కూడా చనిపోలేదని కేంద్రమంత్రి అహ్లూవాలియా అంటున్నారని, కానీ ప్రధాని మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదని దిగ్విజయ్‌ విమర్శించారు. ఎవరు అబద్ధం చెబుతున్నారో తెలుసుకోవాలని దేశం కోరుకుంటోందని ఆయన ప్రశ్నించారు. మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలన్నారు. వైమానిక దాడులు తమ ఘనతే అని చెప్పుకుంటూ ప్రధాని మోదీ, ఆయన మంత్రులు భద్రతా దళాలను అవమానిస్తున్నారని దిగ్విజయ్‌ ఆరోపించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ భారత ఆర్మీ, భద్రతా దళాలపై గౌరవం ఉందన్నారు.