పుల్వామాలో ఎదురుకాల్పులకు ప్రతీకారం

– జైషే అహ్మద్‌ కమాండర్‌ ఘాజీని మట్టుపెట్టిన జవాన్లు
– ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి
– మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
– గాలింపు చర్యలు ముమ్మరం చేసిన భద్రతా దళాలు
శ్రీనగర్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): పుల్వామా దాడికి ఆర్టీ బదులు తీర్చుకుంది. కాశ్మీర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే కమాండ్‌ర్‌ను భద్రతా బలగాలు తుదముట్టించాయి. అయితే ఈ ఘటనలో మరో ఐదుగురు జవాన్లను ఆర్టీ కోల్పోయింది. పుల్వామాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈకాల్పుల్లో జైషే అహ్మద్‌ కమాండర్‌ ఘాజీతో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాళాలు హతమార్చాయి. కాగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పింగలాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచరిస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఆర్మీకి చెందిన 55 రాష్టీయ్ర రైఫిల్స్‌, సీఆర్పీఎఫ్‌, ఎస్‌ఓజీలు సంయుక్తంగా అక్కడకు చేరుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున పింగలాన్‌ చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ తరుణంలో ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించి భద్రతా బలగాలు ఉగ్రవాదులు తలదాచుకున్న నివాసాలను చుట్టుముట్టాయి. లొంగిపోవాలని ఉగ్రవాదులను ఆదేశించినప్పటికీ ఒక్కసారిగా ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. అంతటితో ఆగకుండా ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటి యాజమానిని హతమార్చారు. ఈ ఘటనలో ఓ మేజర్‌ సహా ఐదుగురు సైనికులు అమరులయ్యారు. మేజర్‌ డీఎస్‌ దోండియల్‌, హెడ్‌కానిస్టేబుల్‌ సవే రాం, జవాన్‌ అజయ్‌ కుమార్‌, హరిసింగ్‌లు ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలోనే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన గుల్జార్‌ మహ్మద్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ఎదురుకాల్పుల్లో ఇద్దరు పౌరులు సైతం మృతిచెందారు.  దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఇరు పక్షాల మధ్య ¬రా¬రీగా కాల్పులు జరుగుతున్నాయి.
జైషే మహ్మద్‌ కమాండర్‌ ఘాజీ మృతి..
పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది కమ్రాన్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి పుల్వామా జిల్లాలోని పింగ్లాన్‌ వద్ద జరిగిన ఎదురుకాల్పుల ప్రదేశంలో వీరు ఆర్మీకి చేతికి చిక్కడంతో వారిని హతమార్చారు. 40 మంది జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకోవడానికి పథకం రచించింది జైషే సంస్థ కమాండర్‌ అబ్దుల్‌ రషీద్‌ ఘాజీ అని భద్రతా దళాలు భావిస్తున్నాయి.  వీరి సందేహంలో నిజం లేకపోలేదు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్‌ దార్‌కు శిక్షణ ఇచ్చింది ఘాజీనే. రషీద్‌ జైషే మహమ్మద్‌ (జేఈఎం) సంస్థ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌కు ప్రధాన అనుచరుడు. ఘాజీ ఐఈడీని ఉపయోగించడంలో దిట్ట. మొన్న అదిల్‌ దార్‌కు ఈ విషయంలో శిక్షణ ఇచ్చింది కూడా అతగాడే. ఇతడిని కశ్మీర్‌కు మసూద్‌ అజరే పంపాడు. 2017,2018 సంవత్సరాల్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు జరిగిన దాడుల్లో అజర్‌ మేనల్లుళ్లను మన జవాన్లు మట్టుబెట్టారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఘాజీని అజర్‌ కశ్మీర్‌కు పంపాడు. ఈ దాడులు కూడా పుల్వామాలోనే జరగడం గమనార్హం.