పుల్వామా ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు

తీవ్రంగా ఖండించిన క్రికెటర్లు,సెలబ్రిటీలు
సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటన
న్యూఢిల్లీ,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):  జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం సీఆర్ఫీఎఫ్‌ జవాన్లు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 49 మంది జవాన్లు అమరులయిన ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.  గత మూడేళ్లలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఈ దాడిని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు దాడికి తెగబడటం తీవ్ర విచారం కలిగిస్తుందని భారత క్రికెటర్లు పేర్కొన్నారు. విరాట్‌ కోహ్లీ,గౌతం గంభీర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, రిషబ్‌ పంత్‌, శిఖర్‌ ధావన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌, సురేశ్‌ రైనా, యువరాజ్‌సింగ్‌ తదితరులు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ దాడిని రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించారు. ఉగ్రవాదాన్ని ఓడించడంలో అమెరికా కూడా భారత్‌కు అండగా ఉంటామని తెలిపింది. అయితే ఇంతటి దారుణమైన చర్యని సినిమా సెలబ్రిటీలు కూడా ఖండించారు. దాడిలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం మనసుని కలచి వేసింది. మృతుల సంఖ్య పెరుగుతుండడం బాధని కలిగిస్తుంది. అమరవీరులకు నా తరఫున, జనసైనికుల తరఫున సెల్యూట్‌ చేస్తున్నాను. వారి త్యాగాలను భారత జాతి ఎన్నటికీ మరవదు. అమరులైన ఆ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ
సానుభూతిని తెలియజేస్తున్నానని నటుడు  పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. మనలని కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్లు ఉగ్రదాడిలో మరణించడం మనసుని కలచి వేసింది. ప్రాణాలు విడిచిన జవాన్ల కుటుంబాలకి అండగా నిలబడడం మన ధ్యేయం అని బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ అన్నారు.
పుల్వామా ఘటనతో ఒక్కసారిగా షాక్‌ అయ్యాను. ద్వేషం ఎప్పటికి సమాధానం ఇవ్వదు. ఉగ్రదాడిలో గాయపడ్డ జవాన్ల ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబాలకి ధైర్యం అందించాలని దేవుడిని కోరుకుంటున్నాను అని నటి ప్రియాంక చోప్రా తెలిపారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ సైనికులపై జరిగిన భీకర దాడి ఇంకా నమ్మశక్యంగా లేదు. ఈ ఘటనని ఎప్పటికి మరచిపోలేము. దాడిలో గాయపడ్డ వారు వేగవంతంగా రికవర్‌ కావాలని దేవుడిని కోరుకుంటున్నాను. మరణించిన వారి ఆత్మలకి శాంతి కలిగించాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని నటుడు  అక్షయ్‌ కుమార్‌ అన్నారు. పుల్వామా ఘటనకి సంబంధించిన వార్త నన్ను ఎంతగానో కలచి వేసింది. దాడిలో మరణించిన వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి దేవుడు కొండంత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు నటి అనుష్క శర్మ తెలిపారు. కేవలం బాలీవుడ్‌కి చెందిన సెలబ్రిలే కాకుంగా టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌, శాండల్‌వుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు పుల్వామా ఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉగ్రదాడిలో మరణించిన సైనికుల ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబాలకి దేవుడు కొండంత ధైర్యం అందించాలని ట్వీట్‌లో తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కూడా వారు ఆకాంక్షించారు.