పుల్వామా ఉగ్రదాడి: 30కి చేరిన మృతులు

పుల్వామా: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతుల సంఖ్య 30కి చేరింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అక్కడి అధికారులతో మాట్లాడారు. గత 20ఏళ్ల కాలంలో ఇంత దారుణమైన దాడి జరిగిన దాఖలాలు లేవని భద్రతా సిబ్బంది చెబుతున్నారు. జమ్ము నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ అవంతిపురా సమీపంలోకి రాగానే ఈ దాడి జరిగింది. కాన్వాయ్‌లో మొత్తం 70 వాహనాలు ఉన్నాయి. అందులో 2500 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్నట్లు సీఆర్పీఎఫ్‌ డీజీ ఆర్‌ఆర్‌ భట్నాగర్‌ తెలిపారు. ఈ ఘటనతో రాష్ట్రంలో హై అలర్ట్‌ ప్రకటించారు.

జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాది అదిల్‌ అహ్మద్‌ దాదాపు 350 కేజీల పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కారుతో సీఆర్ఫీఎఫ్‌ కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టాడు. దీంతో భారీ విస్ఫోటనం సంభవించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దాడిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ,  దిల్లీ సీఎం  కేజ్రీవాల్‌తో పాటు పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. ‘పుల్వామా దాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా బాధించింది. అమరులైన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఈ దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని మమతా ట్వీట్‌ చేశారు.

‘సీఆర్పీఎఫ్‌ వాహనంపై దాడి ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. ఈ దాడిలో అనేకమంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు.