పుల్వామా ఘటనలో మరో నలుగురు జవాన్ల మృతి

చికిత్స పొందుతూ మృతి చెందారని వెల్లడి
49కి చేరుకున్న మృతుల సంఖ్య
మరో ముగ్గురు జవాన్ల కోసం గాలింపు
శ్రీనగర్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి జరిగిన ఘటనలో ప్రాణాలు వదిలిన జవాన్ల సంఖ్య 49కి చేరుకున్నది. ఈ విషయాన్ని సీఆర్‌పీఎఫ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. గాయపడ్డ జవాన్లలో శుక్రవారం మరో నలుగురు మృతిచెందారు. శ్రీనగర్‌లోని బదామిభాగ్‌ హాస్పటల్లో చికిత్స పొందుతూ గాయపడ్డ నలుగురు జవాన్లు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 49కి చేరుకున్నది. ఇకపోతే మరో ముగ్గురు జవాన్ల ఆచూకీ లేదని గాలిస్తున్నామని వెల్లడించారు. జమ్మూ శ్రీనగర్‌ హైవేలోని లేత్‌పోరా ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై జైషే ఉగ్రవాది ఫిదాయిన్‌ దాడి చేశాడు. ఉగ్రవాది అదిల్‌ టార్గెట్‌ చేసిన బస్సులో మొత్తం 44 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఉన్నారు. అయితే ఆ బస్సు పేలుడు వల్ల అందులో ఉన్న జవాన్లలో ఒక్కరు కూడా బ్రతకలేదు. పేలుడు ధాటికి ధ్వంసం అయ్యిన మరో వాహనంలో అయిదుగురు గాయపడ్డారు. ఆ బృందంలో ఒకరు గురువారమే ప్రాణాలు విడిచాడు. ఇప్పటికే 46 మంది జవాన్ల మృతదేహాలను వాళ్ల వాళ్ల స్వంత గ్రామాలకు తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరో ముగ్గురి మృతదేహాలు మాత్రం ఇంకా ఆచూకీ చిక్కడం లేదన్నారు. ఘటన జరిగిన రోడ్డును ప్రస్తుతం మూసివేశారు. ట్రాఫిక్‌ను గాలెండర్‌ మార్గం దిశగా తరలిస్తున్నారు. ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ దర్యాప్తు బృందాలు హైవేపై ఆనవాళ్లు సేకరించనున్న నేపథ్యంలో ఆ రూట్లో కొంత సమయం ట్రాఫిక్‌ను నిలిపేయనున్నారు. మిస్సయిన ముగ్గురు జవాన్ల కోసం దాడి జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు వెతుకుతున్నాయి.