‘పుల్వామా’ సూత్రధారి హతం!

– మరో ముగ్గురు ఉగ్రవాదులు మృతి
– త్రాల్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు
– ఎనిమిది గంటలపాటు సాగిన కాల్పులు
శ్రీనగర్‌, మార్చి11(జ‌నంసాక్షి) : జమ్మూ కశ్మీర్‌లో ఆదివారం అర్ధరాత్రి పుల్వామా జిల్లా త్రాల్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎనిమిది గంటలపాటు సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులనుసైన్యం హతమార్చింది. వీరిలో పుల్వామా ఆత్మాహుతి దాడి సూత్రధారుల్లో ఒకడైన ముదాసిర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహద్‌ భాయ్‌ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న సైన్యం, వారిని గుర్తించే పనిలో ఉంది. త్రాల్‌ సవిూపంలోని పింగ్లష్‌లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న నిఘా వర్గాల పక్కా సమాచారంతో భద్రత దళాలు ఆదివారం అర్ధరాత్రి అక్కడకు చేరుకుని సోదాలు నిర్వహించింది. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమై ధీటుగా బదులిచ్చింది.
దాదాపు 8 గంటలపాటు సాగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరుల్ని ఆర్మీ మట్టుబెట్టింది. సైన్యం
కాల్పుల్లో హతమైన ఉగ్రవాది మహద్‌ భాయ్‌ స్వస్థలం పుల్వామా జిల్లా త్రాల్‌ పట్టణంలోని మిర్‌ మొహల్లా. డిగ్రీ చదివిన అతడు ఎలక్టీష్రియన్‌గా ఏడాది డిప్లమా చేశాడు. పుల్వామా ఆత్మాహుతి దాడికి అతడే వాహనం, పేలుడు పదార్థాలను సమకూర్చినట్టు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఇక, 2017లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థలో చేరిన మహద్‌, తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలకు సహాయం చేసే నూర్‌ మహ్మద్‌ తాంత్రే అనుచరుడిగా ఉన్నాడు. అయితే, 2017 డిసెంబరులో నూర్‌ను భారత సైన్యం మట్టుబెట్టడంతో 2018 జనవరి 14 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నాడు. పుల్వామా దాడికి పాల్పడిన మానవ బాంబు అదిల్‌ అహ్మద్‌ దార్‌తో ముదాసిర్‌ తరుచూ సంభాషించినట్టు అధికారులు తెలిపారు. సాధారణ కూలీ కుమారుడైన మహద్‌, 2018 ఫిబ్రవరిలో సుంజ్వాన్‌ ఆర్మీ స్థావరంపై దాడికి పాల్పడి ఆరుగురు జవాన్లను చంపిన ఘటనతోనూ ఇతడికి సంబంధం ఉంది. అలాగే గతేడాది జనవరిలో లేత్‌పోర్‌ సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై జరిగిన దాడిలోనూ కీలక పాత్రధారిగా ఉన్నట్టు విచారణలో తేలింది. పుల్వామా ఆత్మాహుతి దాడికి వినియోగించిన మారుతీ ఇకో మినీవ్యాన్‌ను ఈ ఘటన జరగడానికి 10రోజుల ముందే మరో జైషే మహ్మద్‌ ఉగ్రవాది సాజిద్‌ భట్‌ నుంచి కొనుగోలు చేసినట్టు గుర్తించారు. దక్షిణ కశ్మీర్‌లోని బిజ్‌బెహారాకు చెందిన సాజిత్‌ చాలాకాలం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తూ ప్రస్తుతం చురుకుగా ఉన్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి.