పుష్కర ఘాట్లకు ప్రత్యేక బస్సులు

మహబూబ్‌నగర్‌,జూన్‌15(జ‌నంసాక్షి):   కృష్ణా పుష్కరాలకు గాను పాలమూరు జిల్లాలో ఉన్న పుష్కరఘాట్లకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వీటినినడుపున్నారు. జిల్లాలో 9 ఆర్టీసీ డిపోల నుంచి 433 సర్వీసులను నడిపేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు.పుష్కరాలకు ఆర్టీసీ పరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ తెలపారు. జూలై మొదటి వారం వరకు ఘాట్లు ఏర్పాటుచేసి అనంతరం బస్సుల కేటాయింపు, పార్కింగ్‌లపై పూర్తిస్థాయి పక్రియ తయారుచేస్తామన్నారు.  జిల్లాలో మొత్తం 32 ఘాట్లు ఏర్పాట్లు చేస్తుండగా వాటి వద్ద జనాన్ని చేర్చడం కోసం ఈ బస్సులను కేటాయించారు. వీటిలో 250 బస్సులు జిల్లాలోని డిపోల నుంచి తీసుకున్నారు. మిగతా బస్సులను ఇతర జిల్లాల నుంచి అద్దె ప్రాతిపదికన బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాలో కృష్ణా, మాగనూరు, మక్తల్‌, ధరూర్‌, ఇటిక్యాల, ఆత్మకూరు, గద్వాల, వీపనగండ్ల, కొల్లాపూర్‌, అచ్చంపేట, తదితర ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. ఈ ఘాట్లకు 12 రోజుల పాటు ప్రజలను చేర్చడం కోసం డిపోల వారీగా ప్రత్యేక బస్సులు కేటాయిస్తున్నారు. ఒక్కొక్క బస్సు 3 నుంచి 4 ట్రిప్పుల నుంచి బస్టాండు నుంచి ప్రజలను ఘాట్లకు తరలించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.