పూడిక మట్టి పొలాలకు తరలించే చర్యలు తీసుకోవాలి: కలెక్టర్‌

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌1  : చెరువుల పునరుద్దరణలో భాగంగా రైతులు పూడికమట్టిని తీసుకెళ్లి పంట పొలాలలో వేసుకునేలా డ్వామా, వ్యవసాయం, ఉద్యానవనశాఖ అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ జగన్మోహన్‌  సూచించారు.  చెరువుగట్టు, చెరువుశిఖం భూముల్లో పర్యావరణానికి అనువైన మొక్కలను నాటాలన్నారు. అటవీశాఖ అధికారులను, చెరువుల కింద ఎలాంటి ఉద్యానవన పంటలు, కూరగాయలను పండించాలో రైతులకు వివరించాలని పేర్కొన్నారు. పంచాయతీల్లో పాడుబడ్డ బావులను గుర్తించి నివేదిక పంపాలని అన్నారు. పూడిక తీసిన చెరువుల్లో చేపల పెంపకం ద్వారా అధికంగా లబ్దిపొందేలా, మత్స్యశాఖ అధికారులు, దోబీఘాట్ల నిర్మాణంపై బీసీ కార్పొరేషన్‌, రైతుచేలకు మట్టిని తరలించడానికి డ్వామా, శిఖం భూముల గుర్తించాలన్నారు. కళాజాత ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా మిషన్‌ కాకతీయ కార్యక్రమాలపై ప్రజల్లో విస్త్రృత ప్రచారం కల్పించాలని తెలిపారు  జిల్లాలో మిషన్‌ కాకతీయ కింద 340 చెరువుల పునరుద్ధరణకు 227 చెరువులకు టెండర్లు పిలిచారు. ప్రస్తుతం కేవలం 86 చెరువుల్లో పనులు ప్రారంభం అయ్యాయి.  పనుల్లో వేగం పెంచాలని, పూడికపనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని హితవు పలికారు. చెరువుల పునరుద్ధరణ వల్ల ప్రభుత్వం ఆశించిన ఫలాలను ప్రజలకు, పర్యావరణానికి అందేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పూడికమట్టిని అతిసారవంతమైందని దాని నమూనాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరించి పరీక్షించాలన్నారు. . ఆర్డీవోలు, తహసీల్దార్లు పనులను తరచూ పర్యవేక్షించాలన్నారు. ఇదిలావుంటే  బాబు జగ్జీవన్‌రాం, డా.అంబేడ్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్‌  పేర్కొన్నారు. ఈనెల 5న జరిగే జగ్జీవన్‌రాం, 14న నిర్వహించే అంబేడ్కర్‌ జయంతి వేడుకల నిర్వహణపై ఆయన సవిూక్షించారు. వేడుకలను ప్రజలు, అధికారులు, దళితసంఘాల నేతలు అధికసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. దళితుల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. పథకాలు అర్హులకు చేరవేయడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. మండల, గ్రామస్థాయిలో వేడుకలు జరిగేలా చూడాలని తెలిపారు. వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని వివరించారు.