పెన్షన్ రూ.7,500 పెంచేందుకు ప్రతిపాదనలు

ప్రభుత్వరంగ సంస్థల్లో, ప్రైవేటు కంపెనీల్లో జీవితకాలం శ్రమించి జీవిత చరమాంకానికి చేరుకున్న వృద్ధులకు గొప్ప శుభవార్త. ఉద్యోగుల పెన్షన్‌ పథకం (ఈపీఎస్‌-1995) పథకం కింద కనీస పెన్షన్‌ను నెలకు రూ.7,500కు పెంచేందుకు సుముఖతను వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. నిర్ణయం తీసుకునే వరకు తాత్కాలిక ఉపశమనం కింద కనీస పెన్షన్‌ను రూ.5వేలు చేయాలని ఆలోచిస్తోంది కేంద్రం. ఈ మేరకు కార్మిక శాఖ నుంచి హామీ వచ్చిందని వెల్లడించింది అఖిల భారత ఈపీఎస్‌-95 పెన్షనర్ల సంఘర్షణ సమితి. ప్రస్తుతం ఈపీఎస్‌-95 పథకం కింద నమోదైన రిటైర్డ్‌ ఉద్యోగులకు కేవలం వెయ్యి రూపాయల పెన్షన్‌ మాత్రమే వస్తోంది. ఈపీఎస్‌-95 పథకాన్ని ఈపీఎఫ్ సంస్థ నిర్వహిస్తోంది.

‘కాకా’ పథకానికి కేంద్రం తూట్లు

పెన్షన్‌ రాని అన్ని వర్గాల ఉద్యోగుల పీఎఫ్‌ నుంచి నిర్ణీత మొత్తాన్ని ఈపీఎస్-95కు మళ్లిస్తూ 1995లో పీవీ నరసింహారావు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి కార్మిక మంత్రి జీ.వెంకటస్వామి(కాకా) ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో బ్రహ్మాండంగా అనిపించినా ఆ పథకం నిర్వీర్యమైంది. 22 ఏళ్లుగా పెన్షన్‌ మొత్తాన్ని పెంచకపోవడంతో ప్రస్తుతం పెన్షన్‌గా అందుతున్న రూ.వెయ్యి హాస్యాస్పదంగా మారింది. 1995నాడు కార్మిక పక్షపాతి కాకా ప్రవేశ పెట్టిన ఈ పథకం ఆనాడు పెన్షనర్లకు వెయ్యి రూపాయలు అంటే ఫర్వాలేదు. కాని 22 ఏళ్ల నుంచి పెన్షన్ పెంచకపోవడం దురదృష్టకరం. నగరాలకు వలసవచ్చి జీవితకాలం పరిశ్రమల్లో శ్రమించిన వారికి అందుతున్న పెన్షన్‌ మొత్తం ఊళ్లో ఉంటున్న తోటి మిత్రుల వృద్ధాప్య పెన్షన్‌తో సమానంగా ఉంటోంది. అసలు ఈపీఎస్‌ చందా ఎందుకు కట్టించుకున్నట్లు? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో తలెత్తుతోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ రిటైర్డ్‌ ఉద్యోగులు సంఘర్షణ సమితిగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. గత డిసెంబరు 6న సమితి ప్రతినిధులు కార్మిక మంత్రితో సమావేశమయ్యారు. ఆయన రూ.7,500 పెన్షన్‌ అంశాన్ని ప్రధాని, ఆర్థిక మంత్రి దగ్గరకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

ఈ పథకం కింద 60 లక్షల మంది పెన్షనర్లు

ఈపీఎస్‌-95 పథకం కింద 60 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారందరికీ రూ.7,500 చొప్పున పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు ప్రైవేటు రిటైర్డ్‌ ఉద్యోగులు సంఘర్షణ సమితి నేతలు. తక్షణ ఉపశమనంగా రూ.5వేలు ఇవ్వాలని కోరారు. జనవరి 5న కార్మిక శాఖ స్థాయీ సంఘం సమావేశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా చర్చించినట్లు వెల్లడించారు. 60 లక్షల మంది పెన్షనర్లలో 40 లక్షల మందికి రూ.1,500 లోపే పెన్షన్‌ వస్తోందని తెలిపారు. ప్రభుత్వం దగ్గర ఈ పెన్షనర్లు జీవితకాలం నెల వాయిదాల రూపంలో చెల్లించిన మూడు లక్షల కోట్లు మూలుగుతున్నాయని వివరించారు సమితి ప్రతినిధులు.