పెరుగుతున్న ఎండలతో ప్రజలను అప్రమత్తం చేయాలి

కొత్తగూడెం,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): జిల్లా అధికారులంతా వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని  జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు చెప్పారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై దృష్టి పెట్టాలని, ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిందని తెలిపారు. ప్రధానంగా కొత్తగూడెంలో ఎండలు  ఎక్కువ కాబట్టి వడదెబ్బ విూతులను నివారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పశుసంవర్థక, వైద్య శాఖ అధికారులు ప్రజలకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి ఒక్కరికీ వివరించాలన్నారు.  వేసవిలో అధక ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలనికోరారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా ప్రణాళిక అధికారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి ఉష్ణోగ్రతలపై అధికారులకు సూచనలను చేశారు.   ప్రయాణం చేసేటప్పుడు గొడుగులు లేదా, తలకు వస్త్రాన్ని చుట్టుకొని వెళ్లాలని, ధరించే దుస్తులలో తెలుపురంగు దుస్తులను వాడాలన్నారు. వీలైనంత వరకు అందుబాటులో ఉన్న నిమ్మరసం, లేదా మజ్జిగను తీసుకోవాలన్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ప్రాథమిక అరోగ్య కేంద్రాలలో, వైద్య శిబిరాలలో తప్పక ఉంచాలని స్పష్టం చేశారు. పిల్లలు గర్భిణులు, వృద్ధులు వేసవిలో ఎక్కువగా తిరగకుండా చూడాలన్నారు. కార్‌పార్కింగ్‌లు చేసేటప్పుడు కారులో ఎవ్వరినీ ఉంచరాదని, చెట్ల నీడలోనే పార్కింగ్‌ చేసుకోవాలని సూచించారు.