పెరుగుతున్న ఎండల తీవ్రత దినసరి కూలీలకు తప్పని కష్టాలు

నల్లగొండ,జ‌నంసాక్షి): ఎప్రిల్‌ మాసంలోనే రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు వడగాల్పులు వీస్తుండడంతో బయటకు వెళ్లాలనుకునే వారు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పక్షంరోజుల నుంచి ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. మే నెలను తలచుకొని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా దినసరి కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా కూలీకి వెళ్లేవారు తీవ్ర అసవ్థలు పడుతున్నారు. వేడి, ఉక్కపోత భరించలేక విలవిల్లాడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి. ఇంటి పట్టున ఉంటేనే ఉక్కపోత భరించలేనంతగా ఉంది. ఇక ఎండల్లో పనిచేసే వారి పరిస్థితి వర్ణనాతీతం. ఈ పరిస్థితుల్లో వృద్ధులు, చిన్నపిల్లలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప సాధారణ పనులను వాయిదా వేసుకుంటున్నారు. వాహనాల టైర్లు పగిలిపోవడం సర్వసాధారణమైంది. వ్యవసాయం, ఉపాధిహావిూ పథకం, భవన నిర్మాణాలు, ఇతర కూలీ పనులపై ఆధారపడి పనిచేసే వారు అధికంగా ఉన్నారు. వారు రెండు పూటలు పనిచేస్తేనే కడుపు నిండుతుంది. ఇలాంటి ఎండల్లో వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే పనివేళలు మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు పనులకు దూరంగా ఉండటమే మంచిదన్నారు. తరువాత పనిచేసే కూలీలు, కార్మికులు నీటిని ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల దాటి అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో
సమస్యలు తలెత్తుతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అసలు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. గర్భిణులు అధికంగా ఎండలో రావద్దని హెచ్చరించారు.