పెళ్లి రోజు ఉడాయించిన వరుడు

నంగునూరు /సిద్దిపేట : వేద మంత్రాల మధ్య పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుని పెద్దల సమక్షంలో 3 లక్షల రూపాయల కట్నం తీసుకుని పెళ్లి రోజే పెళ్లి కొడుకు ఉడాయించిన సంఘటన నంగునూరు మండలం ఖానాపూర్‌లో చోటు చేసుకుంది. బాధితులు, రాజ్‌గోపాల్‌పేట ఎస్‌ఐ గోపాల్‌రావు కథనం ప్రకారం .. ఖానాపూర్ గ్రామానికి చెందిన రేఖ సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన గంగి నవీన్ దూరపు బంధువు. నవీన్ కొంత కాలంగా రేఖను ప్రేమిస్తున్నానని , పెళ్లి చేసుకుంటానని మూడు నెలలు వెంబండించాడు.

ఈ క్రమంలో ఇద్దరు కొంత కాలం ప్రేమించుకున్నారు. తీరా నవీన్ పెళ్లి దాకా వచ్చే సరికి పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. ఈ విషయం పెద్దల వద్దకు వెళ్లింది. నవీన్‌ను పిలిపించి విషయాన్ని ఆరా తీశారు. రూ.3 లక్షలు కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. తీరా పెళ్లి రోజు పెళ్లికొడుకు పెళ్లి పీటలు ఎక్కాల్సిందిపోయి ఉడాయించాడు. బాధితులు రాజ్‌గోపాల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పెళ్లి కొడుకు నవీన్‌తో పాటు తల్లిదండ్రులు కనకయ్య, మల్లవ్వల పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.