పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యం

6148269610j_625x300పెదకాకాని: పేదవాళ్లు లేని సమాజాన్ని తీర్చిదిద్దడమే తన జీవిత లక్ష్యమని సీఎం ఎన్‌. చంద్రబాబు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని స్వస్థిశాలలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెదకాకాని స్వస్థిశాలకు రాష్ట్రంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఇక్కడ మంచి సందేశంతోపాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టడమే నిజమైన సేవన్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి మదర్‌ థెరిస్సా, సిస్టర్‌ నిర్మల చేసిన సేవలను గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ పండుగ చేసుకోవాలని క్రిస్మస్‌ కానుక అందజేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. క్రిస్టియన్‌ సంక్షేమం కోసం రూ.57 కోట్లు  కేటాయించామన్నారు. బెత్లెహోం వెళ్లేవారికోసం ప్రస్తుతమిచ్చే రూ.20 వేలను రూ.40 వేలకు పెంచినట్టు ప్రకటించారు. అలాగే చర్చి నిర్మించుకునే వారికిస్తున్న రూ.లక్షను రూ.3 లక్షలకు పెంచినట్టు తెలిపారు. అందరూ శాంతి, దయ, ఆప్యాయత కలిగి ఉండాలని సూచించారు. ఆ యేసుప్రభువు ఆశీస్సులు ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నారు. ‘యెహోవా నేను బ్రతికియుండు దినములన్నియు కృపాక్షేమములే’’ అని బైబిల్‌ వాక్యాన్ని ఆయనీ సందర్భంగా భక్తులకు చదివి వినిపించారు.