పేదలకు అందుబాటులో అత్యాధునిక ఇళ్లు

విశాఖపట్టణం,నవంబర్‌18(జ‌నంసాక్షి): ప్రతి పేదవాడికీ అత్యాధునిక సౌకర్యవంతమైన ఇంటిని వీలైనంత త్వరగా అందజేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధ్యేయమని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. అనకాపల్లి మండలంలోని సత్యనారాయణపురం పంచాయతీ పరిధిలో మెగాలేఅవుట్‌ ప్రాంతంలో ప్రారంభమైన పట్టణ గృహనిర్మాణ పథకం ఇందుకు నిదర్శనమని అన్నారు.నియోజకవర్గంలోని అర్బన్‌ ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేలాది మంది నివాసాలు లేకుండా అద్దె ఇళ్లలో నివసిస్తున్నారన్నారు. ఒక్క చినముషిడివాడలోనే 2వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఏపీ టిడ్కో ద్వారా ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ అనుమతిచ్చారన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో చినముషిడివాడ, నరవ, చీమలాపల్లి, వెదుళ్ల నరవ, లంకెలపాలెం, నడుపూరు, అప్పికొండ, దేవాడ ప్రాంతాల్లో 51ఎకరాల స్థలం కేటాయించామన్నారు. అధిక సంఖ్యలో ఈ ప్రాంతంలో ఇళ్లు కావాలని కోరుతున్న నేపథ్యంలో ప్రస్తుతం కేటాయించిన స్థలంతో పాటు మరిన్ని స్థలాలు గుర్తిస్తున్నామని అన్నారు. లక్ష్యం మేరకు నిర్మాణాలు నాణ్యతతో పూర్తిచేయాలని కోరారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోరిక మేరకు ప్రస్తుతం నిర్మిస్తున్న 2,520 ఇళ్లకు అదనంగా మరో 2,500 నివాసాలను మంజూరు చేయడానికి అంగీకరించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నాణ్యతా లోపంతో ఇప్పటికీ పలు కాలనీలకు మోక్షం కలగలేదన్నారు. దీంతో ఇటీవల పలుదేశాలు, రాష్టాల్ర పర్యటనలో పరిశీలించిన అత్యాధునిక నిర్మాణాలతో ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. సీర్వాన్‌ టెక్నాలజీతో పునాదుల నుంచి స్తంభాలు, గోడలు ఇనుం, కాంక్రీటుతో ఒకేసారి నిర్మాణం జరుగుతాయన్నారు. దీనికి ప్రతి చదరపు అడుగుకు రూ.200 అధిక వ్యయం అవుతున్నా, ఎక్కువ కాలం మన్నుతున్నందున ముఖ్యమంత్రి ఈ నిర్మాణాలను ఆమోదించినట్లు చెప్పారు. విశాఖ జిల్లాలో సుమారు 36 వేల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. 15 నెలల్లో తొలిదశ నిర్మాణాలన్నీ పూర్తి చేయడంతోపాటు వాటిని ప్రారంభించి, అర్హులకు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 2018 డిసెంబర్‌ లక్ష్యంతో ప్రారంభించిన 5.50 లక్షల ఇళ్లకు రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇళ్లను కేటాయించిన వాటిని త్వరితగతిన నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.