పేదలను దోచుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌

దుబ్బాక ప్రచారంలో మాజీమంత్రి శ్రీధర్‌ బాబు
సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): పేదలను దోచుకునేందుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిందని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు విమర్శించారు. ప్రజలెవరూ ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం కట్టవద్దని కోరారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించి కేసీఆర్‌కు కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు. ఫాంహౌస్‌లో ఉండే కేసీఆర్‌ను ప్రజాక్షేత్రంలోకి తీసుకువచ్చే అవకాశం దుబ్బాక ప్రజలకు వచ్చిందని వివరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిలదీసేందుకు అసెంబ్లీకి ప్రశ్నించే గొంతుకను పంపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మొక్కజొన్నను కొనుగోలు చేయనని ససేమిరా అన్న సీఎం కేసీఆర్‌ దుబ్బాక దెబ్బకు దిగివచ్చి గిట్టుబాటు ధరను ప్రకటించారని, ఇది ఈ నియోజకవర్గ ప్రజల విజయమేనని  అన్నారు.  ఈ ఉపఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ఓడిస్తేనే ప్రభుత్వాలు దిగివస్తాయని, మద్దతు ధర, పంటనష్టం సాధించుకోగలుగుతామని  అన్నారు. పలు గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రైతులు పండించిన పంటకు బీమాలేదని, దీనివల్ల పంట నష్టానికి పరిహారం రాకుండా పోయిందన్నారు. సీఎం కేసీఆర్‌ చెప్పిన విధంగా సన్నరకం ధాన్యాన్ని పండించినందున దిగుబడి ఎకరాకు 30 నుంచి 20 క్వింటాళ్లకు తగ్గిందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2500  గిట్టుబాటు ధర చెల్లించాలన్నారు. పంటనష్టం పరిహారం ఎకరాకు రూ.20 వేలు అందించాలని డిమాండ్‌ చేశారు.  నిరుద్యోగ సమస్యతోపాటు ఇచ్చిన హావిూలను మెడలు వంచి నెరవేర్చుకోవాలంటే దుబ్బాక ప్రజల తీర్పులోనే ఉందన్నారు.